రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న సామెత నిజమని నిరూపిస్తున్నారు ఆ మామ కోడలు. ఇదెక్కడో కాదు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం చినమేరంగి కోటలో. ఇద్దరూ ఒకే కుటుంబం, ఒకే పార్టీలో ఉంటూ ఇలా రచ్చకెక్కడం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ జగన్ కొలువులో ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రిగా పుష్పశ్రీవాణి కొనసాగుతున్నారు. ఇలాంటి తరుణంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక కురుపాం నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరగలేదని.. మంత్రి పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల రాజు చెప్పడం చర్చనీయాంశమైంది. మాజీ శాసనసభ్యులు, వైకాపా నాయకుడైన ఆయన ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కారు. నియోజకవర్గంలో అభివృద్ధిని విస్మరించడం వల్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానని అన్నారు.
కురుపాం నియోజకవర్గంలో అభివృద్ధి అనేది కనిపించడం లేదని వాపోయారు. పింఛన్ల పంపిణీలో అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. పూర్ణపాడు-లాజేమ వంతెన నిర్మాణం విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందో అర్థం కావడం లేదని.. రేగిడి గెడ్డ జలాశయం అనుసంధాన కార్యక్రమం కాగితాలకే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. నాగావళి నది ఎడమ కాలువ ఎత్తిపోతల పథకం కాలగర్భంలో కలిసిపోయిందన్న శత్రుచర్లరాజు.. జియ్యమ్మవలస మండలం చందు నుంచి అప్పుల భద్ర, పరసపాడుతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు.
తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వ్యవసాయ రంగంలో ఇటువంటి సంక్షోభం ఎప్పుడూ చూడలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగితే.. జగన్ హయాంలో అది కొన్ని వర్గాలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు..
ఈ నేపథ్యంలో శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వ్యాఖ్యలను ఖండించేందుకు.. ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆయన కుమారుడే రంగంలోకి దిగడం ఆసక్తికర అంశం. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భర్త అయిన పరీక్షిత్ రాజు.. వైకాపా అరకు పార్లమెంటు అధ్యక్షుడి హోదాలో తన తండ్రి చేసిన ఆరోపణలను ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. కురుపాం నియోజకవర్గంలో గతేడాది కాలంలో జరిగిన అభివృద్ధిని చూపించడానికి తాము సిద్ధమన్నారు. 5 మండలాల పరిధిలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఉపముఖ్యమంత్రి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏడాది కాలంలో నియోజకవర్గంలో రహదారులు, భవనాలు, విద్య, తాగునీరు, చెరువుల మరమ్మతుల కోసం రూ. 310 కోట్ల రూపాయలు మంజూరైనట్లు చెప్పారు.
ఇవీ చదవండి... హలం పట్టి..పొలం దున్నిన మాజీ మంత్రి మణికుమారి