Self Employment Training In Centurion University : ఇది విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం టెక్కలిలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం. ఇతర యూనివర్సిటీలకు భిన్నంగా ఇక్కడ రెగ్యులర్ కోర్సులతో పాటు స్వయం ఉపాధి కోర్సులూ నిర్వహిస్తున్నారు. విద్యతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కల్పిస్తున్నారు. మహిళలు, విద్యార్ధినుల కోసం స్వీయింగ్ మిషన్ ఆపరేషన్ (ఎస్ఎంవో) అనే ప్రత్యేక యూనిట్‌ను ఇక్కడ నెలకొల్పారు. ఇందులో విశాలమైన గదిలో అధునాతన కుట్టుమిషన్లు ఏర్పాటు చేశారు. పెద్దపెద్ద గార్మెంట్స్ పరిశ్రమల్లో వినియోగించే సింగల్ థ్రెడ్, మల్టీలాక్ థ్రెడ్, కంప్యూటరైజ్డ్ బటన్ మిషన్, వివిధ రకాల కటింగ్ మిషన్ల ద్వారా ఆధునిక పద్ధతుల్లో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణలో తొలుత కాగితాన్ని, రెండో దశలో వస్త్రాన్ని వినియోగిస్తున్నారు. విద్యార్ధులకు విద్యతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ యువత, నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధిపై సర్టిఫికెట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సెంచూరియన్ ఉపకులపతి తెలిపారు.
"సెంచూరియన్ యూనివర్సిటీని గ్రీన్‌ఫీల్డ్ యూనివర్శిటీ అంటారు. ఇంటర్, డీగ్రీ, పీజీ స్థాయి విద్యార్థినులకు ఉచితంగా శిక్షణను ఇచ్చి.. వారి ఉపాధి, స్వయం ఉపాధిని కల్పించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. దీనికోసం ప్రత్యేకంగా ఓ యూనిట్‌ను ఏర్పాటు చేశాము." -జి.ఎస్.ఎన్.రాజు, ఉపకులపతి, సెంచూరియన్ విశ్వవిద్యాలయం
సెంచూరియన్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న స్వీయింగ్ మిషన్ ఆపరేషన్ ద్వారా నెల్లిమర్ల మండలంలోని కొండవెలగాడ, చంద్రంపేట, టెక్కలి, పారసాం, బూరడపేట, ఎల్.ఎన్.పురం, బొండపల్లి మండలంలోని అంబటివలస, గొట్లాం, రోల్లవాక, నెలివాడ, బిళ్లలవలస, విజయనగరం మండలం నుంచి కొండకరకాం, వైఎస్ఆర్ కాలనీకి చెందిన మహిళలు రెండు విడతల్లో 65 మంది శిక్షణ పొందారు. తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌కు చెందిన మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ నుంచి ఇంటర్ విద్యార్ధులు కూడా ఇక్కడ శిక్షణ పొందుతున్నారు. మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు గుర్తింపు పత్రాలు అందచేస్తున్నారు. వీటితో కార్పొరేట్ పరిశ్రమల్లో ఉపాధికి అవకాశం ఉంటుంది.
"స్వీయింగ్ మిషన్ ఆపరేషన్ కోర్సులో ఇండస్ట్రీ స్థాయిలో గార్మెంట్స్ తయారీకి శిక్షణ ఇస్తున్నాము. సంవత్సరం క్రితం నుంచి ఈ కోర్సులో శిక్షణ ఇస్తున్నాము. విభిన్నమైన మిషన్ల ఆపరేటింగ్‌లో శిక్షణ ఇస్తున్నాము." -సన్నిడయల్, స్కిల్ కో-ఆర్డినేటర్, సెంచూరియన్ విశ్వవిద్యాలయం
సెంచూరియన్ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాలపై విద్యార్ధులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కుట్టుమిషన్ శిక్షణలో మెళకువలు నేర్చుకుని ఇంటి వద్ద సొంతంగా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారు.
"మేము మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సోసైటి మహబూబ్‌నగర్‌లో ఇంటర్ చదువుతున్నాము. నెల రోజుల శిక్షణ కోసం ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడ మిషన్ వినియోగం, గార్మెంట్స్ తయారీలో శిక్షణ తీసుకున్నాము." -విద్యార్థిని
"మేము శిక్షణ తీసుకున్న 45రోజులలో మాకు బస్సు సౌకర్యం, భోజనం సౌకర్యం కల్పించారు. ఇక్కడ శిక్షణతో పాటు మోటివేషన్ తరగతులు కూడా అందించారు. ఇక్కడి వాతావరణం చాలా బాగుంది." -విద్యార్థిని
విద్యార్ధులతో పాటు గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి మార్గాలు మెరుగుపరుచుకుంటూ ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు సెంచూరియన్ విశ్వవిద్యాలయం అండగా నిలుస్తోంది. టైలరింగ్ శిక్షణపై ఆసక్తి ఉన్న మహిళకు శిక్షణతో పాటు రవాణా, భోజన వసతి కూడా ఉచితంగా కల్పిస్తోంది. వివిధ కంపెనీలు, ఆసుపత్రులు, కళాశాలల ఏకరూప దుస్తుల ఆర్డర్ల ద్వారా శిక్షణ పూర్తిచేసుకున్న మహిళలకు ఉపాధి అవకాశాలను సైతం కల్పిస్తోంది.
ఇవీ చదవండి: