విజయనగరం జిల్లా చీపురుపల్లి, బలిజిపేట, గుమ్మలక్ష్మీపురం పంచాయతీ పోరులో ప్రతి ఓటూ కీలకమే. గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. అందుకే బరిలో దిగిన అభ్యర్థులంతా అందరినీ ప్రసన్నం చేసుకుంటారు. జిల్లాలో రెండు, మూడు, నాలుగు విడతల్లో జరిగే సం‘గ్రామ’ బరిలోకి దిగిన వారి దృష్టంతా వలస ఓటర్లపై పడింది. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని సొంత గ్రామాలకు రప్పించాలని చూస్తున్నారు. ఇందుకు వరసలు.. చుట్టరికాలు సైతం కలుపుతున్నారు.
* అల్లుడు.. ఎలా ఉన్నావు.. పిల్లలు, కూతురు బాగున్నారా.. ఏంటి సంగతులు. నీ ఫోన్ నంబరు మీ నాన్నను అడిగితే మనోళ్లకు ఇచ్చారు. ఇంతకీ సంగతి ఏంటంటే.. మన పంచాయతీలో నేను సర్పంచిగా పోటీ చేస్తున్నాను. మీ ఓట్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఎన్నిక రోజు వచ్చి ఓటేయాలి. మరిచిపోవద్ధు ఇది పార్వతీపురం డివిజన్‌లో అభ్యర్థులు తమ ప్రాంతానికి చెందిన వలసదారులకు ఫోన్లో ఆహ్వానం.
* ఏరా.. మనోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో ఓమారు వివరాలు కనుక్కో.. వాళ్ల ఫోన్ నంబర్లు తీసుకో.. ఓ సారి మాట్లాడేద్దాం.. వాళ్లంతా పంచాయతీ ఎన్నికకు వచ్చి ఓటేసేలా సూడాల్రా.. ఇవి విజయనగరం డివిజన్‌లో తమ అనుచరులకు ఆశావహులు పురమాయింపులు.
జిల్లాలో వలస మండలాలు
* బలిజిపేట, పార్వతీపురం, బొబ్బిలి
* మెంటాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస
* మక్కువ గజపతినగరం
అమ్మా.. అయ్యా అంటూ..
పంచాయతీల్లో ఈ మాటలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అమ్మా.. అయ్యా అంటూ వలసదారులతో ఫోన్లలో రాత్రిపూట మాట్లాడుతూ.. వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు పోటీదారులు. గ్రామాల్లో ఓటుండి.. పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఎన్నికల సమయానికి రప్పించే పనిలో ఉన్నారంతా. ఒక పక్క ప్రచారానికి సిద్ధమవుతూనే మరోవైపు వారిని ఆకర్షించే కార్యక్రమం మొదలెట్టారు. జిల్లాలో దాదాపు 20 వేల మంది వరకు వలసదారులు ఉంటారు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్, చెన్నై, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళుతుంటారు. వీరి ఓట్లు ఎన్నికల ఫలితాలను నిర్దేశించనుండడంతో అభ్యర్థులు వారి మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. నువ్వొచ్చి ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్నారు.ఖర్చులు భరించడానికి సిద్ధమవుతున్నారు.