కుటుంబానిది పాత గోనె సంచులు అమ్ముకునే నేపథ్యం.! పుట్టుకతోనే కంటి చూపు లేదు. అన్నీ ఉన్నవాళ్లనూ అలసిపోయేలా చేసేంత లక్ష్యం. సాధించే క్రమంలో..... ఎన్నో సవాళ్లు., అదనంగా అవమానాలు.! అయినా.. ఈయన కఠోర శ్రమ ముందు... ఆటంకాలన్నీ చిత్తయ్యాయి.! తిరుగులేని సంకల్పానికి... కలెక్టర్ కావాలనుకున్న కొండంత లక్ష్యం కరిగి ఈయన దరిచేరింది.
దేశంలో అంధులైన ఐఏఎస్ అధికారులు ఐదుగురు ఉంటే.... వారిలో కట్టా సింహాచలం తొలి తెలుగు అధికారి. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడపల్లి. ప్రస్తుతం విజయనగరం జిల్లా సహాయ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఐఏఎస్ సాధించాలన్న ఈయన లక్ష్యానికి...అంగవైకల్యం అడ్డు తగల్లేదు. డాక్టర్ కావాలన్న చిన్ననాటి లక్ష్యాన్ని పక్కనపెట్టి.... స్నేహితుల సలహాతో ఐఏఎస్ వైపు మళ్లారు.
ఐఆర్ఎస్ వచ్చినా...ఐఏఎస్ వైపు కదిలాడు
ఐదుగురి సంతానంలో సింహాచలం చిన్నవారు. తండ్రి చేసే పాత గోనె సంచుల వ్యాపారమే, కుటుంబానికి ఆర్థికంగా అండ.! సింహాచలం పేదరికంతో పోరాడుతూనే డిగ్రీ పూర్తి చేశారు. బీఈడీ తర్వాత 2014లో సివిల్స్ పరీక్ష రాశారు. అప్పట్లో కలెక్టరయ్యే అవకాశం కొద్దిలో చేజారింది. 2016లో ఐఆర్ఎస్ విభాగంలో ఆదాయపు పన్ను శాఖాధికారిగా దిల్లీ, హైదరాబాద్‌లో పనిచేశారు. మరో ప్రయత్నంలో ఐఏఎస్ సాధించి... ప్రస్తుతం విజయనగరం జిల్లా సహాయ కలెక్టర్‌గా... అందరిలా చురుగ్గా, సమర్థంగా పనిచేస్తున్నారు. అంగవైకల్యం ఉన్న పిల్లల ప్రతిభను తల్లిదండ్రులు గమనించి ప్రోత్సహించాలని... సింహాచలం అంటున్నారు.
ఏదైనా సాధించాకే సమాజం గుర్తిస్తుంది. కానీ పిల్లల సామర్థ్యమేంటో గుర్తించి భుజం తట్టేది కుటుంబమేనన్నది సింహాచలం మాట. ఐఏఎస్ అధికారి స్థాయిలో....10 మందికి మంచి జరుగుతుందంటే ఎంతవరకైనా వెళ్తానంటున్నారు.