Bhogapuram Airport Expatriates: విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం నిర్మించాలని.... గత ప్రభుత్వ హయాంలోనే నిర్ణయించారు. ఇందుకు 2,700ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. మరడపాలెం, ముడసర్లపేట, బొల్లింకలపాలెంలో, రెల్లిపేట గ్రామాస్తులకు.. పరిహారంతో పాటు పునరావాస కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఏడేళ్లు గడిచినా..ఇప్పటికీ పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోగా.. మౌలిక సదుపాయాలేవీ కల్పించలేదు. కానీ నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ముందుగా బడి, గుడులను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు ఖాళీ చేయకుంటే విద్యుత్, నీటి సరఫరా ఆపేస్తామని అధికారులు బెదిరిస్తున్నట్లు నిర్వాసితులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఇళ్ల కూల్చివేశారు. బడులను కూల్చివేస్తే..పిల్లల్ని చదువు కోసం ఎక్కడికి పంపాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు.
"మేము ఇళ్లులు ఇచ్చి బాధపడుతుంటే.. అధికారులు కనీసం నైతికంగా కూడా వ్యవహరించడంలేదు. వాళ్లకి నచ్చిన విధంగా. ప్రమోషన్స్ కోసం.. అక్రమంగా ఇళ్లులు తొలగిస్తున్నారు. వీటిని మేము వ్యతిరేకిస్తున్నాం. అక్కడ సౌకర్యాలు పూర్తిగా కల్పించకుండానే కరెంటు తీస్తామని బెదిరిస్తున్నారు. మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలి.. రానివారికి ప్యాకేజీలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం"-స్థానికులు, భోగాపురం
నిర్వాసితులకు ఇంటి గ్రాంట్ కింద 2లక్షల 75వేల రూపాయలు...ఆర్థిక సాయం కింద మరో 5 లక్షలు, తాత్కాలిక భృతి కింద నెలకు 3వేలు చొప్పున ఏడాది కాలానికి 36 వేలు ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇచ్చారు. ఇళ్లు ఖాళీ చేసే సమయంలో రవాణా ఖర్చులకు 50వేలు, పశువులశాలలు, బడ్డీల తరలింపునకు 25వేలు, చిరువ్యాపారులకు 25వేలు, రీసెటిల్మెంట్ అలవెన్స్ కింద 50 వేలు ఇస్తామని తెలిపారు.
అధికారులు మాత్రం దేనికి ఎంత అని చెప్పకుండా నిర్వాసితుల ఖాతాల్లో 9లక్షల 20 రూపాయల జమ చేశారు. వీటిల్లో కొంతమందికి డబ్బులు ఇంకా రాలేదు. తమకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేయించాలంటూ నిర్వాసితులు విజయనగరం కలెక్టరేట్‌ను ముట్టడించారు.
నిర్వాసితులంతా గ్రామాలను ఖాళీ చేసి.. పునరావాస కాలనీల్లోనే తాత్కాలిక వసతి ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అయితే పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించిన తర్వాతే గ్రామాలను ఖాళీ చేస్తామని నిర్వాసితులు చెబుతున్నారు. బలవంతంగా ఖాళీ చేయిస్తే ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
ఇవీ చదవండి: