Bhavishyathu ki Guarantee Chaitanya Rath Yatra: తెలుగుదేశం పార్టీ తలపెట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య రథయాత్ర రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలు, కార్యకర్తలు, టీడీపీ శ్రేణులు యాత్రకు స్వాగతం పలుకుతున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో భవిష్యత్తు గ్యారెంటీ చైతన్య రథయాత్ర శుక్రవారం దిగ్విజయంగా సాగింది. పలు గ్రామాల్లోని ప్రజలు, మహిళలు టీడీపీ నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు పోలిపల్లి పైడితల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం జెండా ఊపి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు చైతన్య రథయాత్రను ప్రారంభించారు.
ఉదయం వేళ సంతకవిటి మండలం బొద్దురు, గుల్ల సీతారాంపురం మీదుగా చైతన్య రథయాత్ర రేగిడి మండలం అంబకండి, ఉంగరాడ గ్రామాల్లో నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు, టీడీపీ శ్రేణులు తెలుగుదేశం నాయకులకు హారతులతో ఘనస్వాగతం పలికారు. మధ్యాహ్నం వంగర మండలం మడ్డువలస, అరసాడ, వంగర నామాల్లో చైతన్య రథయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో టీడీపీ నాయకులు మడ్డువలస ప్రాజెక్టును సందర్శించారు.
చైతన్య రథయాత్ర ప్రారంభంతో పాటు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత రాజాం సామాజిక ఆసుపత్రి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. టీడీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను సెల్ఫీ చాలెంజ్ ద్వారా సవాల్ విసిరారు. రాజాం పట్టణంలో రహదారులు ధ్వంసం కావటంతో మరమ్మతులు చేపట్టాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ నాయకులు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో నీటిని తొలగించి కోట్ల రూపాయల మత్స సంపదను దోచుకున్నారని ఆరోపించారు. రాజాం పట్టణంలో నిర్వహించిన సభలో మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శిచారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ 200 రూపాయలు ఉన్న పింఛన్లను.. వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని అన్నారు. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ ప్రశ్నించే వారిపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేసులు పెట్టి భయ భ్రాంతులకు గురి చేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ని కేసులు పెట్టినా టీడీపీ నాయకులు భయపడేది లేదని వివరించారు.