ఏ ఎన్నికల్లో అయినా బ్యాలెట్ పత్రాలే కీలకం. వాటిని చాలా జాగ్రత్తగా, తప్పులు లేకుండా ముద్రించాలి. ఆపై పోలింగ్ కేంద్రాల వారీగా పంపిణీ చేయాలి. ఈ ప్రక్రియ అధికారులకు కత్తి మీద సాములాంటిదే. విజయనగరం జిల్లాలో పల్లె పోరుకు బ్యాలెట్ పత్రాలను సిద్ధం చేసే పని మొదలైంది.
స్ట్రాంగ్ రూం నుంచి బయటకు..
జిల్లాలో 959 పంచాయతీల్లో 14.80 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరందరూ సజావుగా ఓటేయాలంటే భారీ కసరత్తు అవసరం. నవంబరులోనే బ్యాలెట్ పత్రాలు జిల్లాకు వచ్చాయి. వాటిని మార్చిలోనే ముద్రించి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. మరోసారి వీటిని పరిశీలించడానికి శుక్రవారం జడ్పీ నుంచి పంచాయతీ వనరుల కేంద్రానికి తరలించారు. వరుస సంఖ్య, ముద్రణ, తదితర అంశాలను పరిశీలించనున్నారు.
గరిష్ఠంగా 12 గుర్తులు..
రెండు రకాల బ్యాలెట్ పత్రాలు ఉంటాయి. ఒకటి సర్పంచి, రెండోది వార్డు సభ్యుడు. ఓటర్లు వేర్వేరుగా ఓట్లు వేయాలి. సర్పంచులకు ముదురు గులాబీ, వార్డు సభ్యులకు తెలుపు రంగు కాగితాలను కేటాయించారు.
ఆంగ్ల అక్షర క్రమంలో 20 రకాల గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తారు. జిల్లాలో గరిష్ఠంగా ఒక బ్యాలెట్‌లో 12 రకాల గుర్తులు ముద్రించినట్లు అధికారులు వెల్లడించారు. ఒకవేళ అభ్యర్థుల సంఖ్య పెరిగితే అప్పటికప్పుడు ముద్రించేలా ఏర్పాట్లు చేయనున్నారు.
తొలిసారిగా నోటా..
తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా గుర్తును కేటాయించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. చాలాసార్లు అభ్యర్థుల భవితవ్యం ఒకటి, రెండు ఓట్ల తేడాతో తారుమారు అవుతుంది. ఇప్పుడు అవే ఓట్లు నోటాకు పడితే ఫలితాలపై ప్రభావం చూపనుంది.
ఇదీ చదవండి: