తమకు నష్టం కలిగించేలా ప్రభుత్వం ఏ ప్రయత్నం చేసినా ఊరుకోబోమని కడప జిల్లా రాజంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం (rajampeta ICDS project office) ఎదుట అంగన్‌వాడీ (anganwadi) కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ప్రాథమిక పాఠశాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను విలీనం(merging in primary schools) చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అంగన్వాడీలకు న్యాయం చేయకపోగా... అన్యాయం చేసే ప్రయత్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన విద్యా విధానాన్ని రద్దు చేయండి...
నూతన విద్యా విధానాన్ని రద్దు చేసి అంగన్‌వాడీ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని అనంతపురంలో అంగన్‌వాడీ కార్యకర్తలు కోరారు. సచివాలయాలకు అనుబంధంగా ఉన్న బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరంలో అంగన్‌వాడీ సిబ్బంది భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంగన్ వాడీ సెంటర్లను ప్రాథమిక పాఠశాలల్లోకి విలీనం చేసేందుకు తీసుకువచ్చిన జీవో నంబర్ 172ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వారి కుటుంబాలను ఆదుకోవాలి...
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ... కృష్ణా జిల్లా నందిగామ ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆందోళన చేశారు. కనీస వేతనం రూ. 21,000 కు పెంచి, పదవీవిరమణ అనంతరం రూ.3 లక్షలు ఇవ్వాలని కోరారు. అంగన్‌వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించటం సహా ప్రభుత్వ ఉద్యోగులకు అందించే కనీస వేతనాలు ఇవ్వాలని విజయవాడలో ధర్నా చేశారు. నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనాతో మృతి చెందిన అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలంటూ విజయనగరంలో ఆందోళన నిర్వహించారు. అంతే కాకుండా వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
'ప్రజలకు విజ్ఞప్తి... నా సమస్యను సీఎం జగన్ సారుకు చేరవేయండి'