చుట్టూ చెట్టు చేమలు..! చీకటి పడితే కీటకాల చప్పుళ్లు..! దూరంగా కొండపైన ఓ ఆలయం.! వెళ్లడానికి సరైన రోడ్డూలేదు..! అలాంటి చోట ఒంటరిగా వనవాసం చేస్తున్నారు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం పెదకాదకు చెందిన పద్మావతిదేవి..! పదిహేనేళ్ల వయసులోనే గ్రామ సమీపంలోని మరుపల్లికొండపైకి వెళ్లిన ఆమె.. చిన్న పాక వేసుకొని అక్కడే ఉండిపోయారు.
75 ఏళ్ల వయసులోనూ..
ఇప్పుడామె వయసు సుమారు 75 ఏళ్లు. ఇప్పటిదాకా ఆమె.. ఆ కొండను వదిలి రాలేదు. ఇప్పుడంటే చెట్లమధ్య ఓ గుడి కనిపిస్తోందిగానీ.. ఆ రోజుల్లో అదంతా అరణ్యం. పాములు, ఇతర క్రిమికీటకాల.. సంచారం మధ్యే గడిపారామె. కుటుంబ సభ్యులు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా వెళ్లలేదు. వాళ్లే.. తరచూ వెళ్లి బాగోగులు చూసి వస్తుంటారు.
ఆలయం నిర్మించారు..
పద్మావతీదేవి అక్కడే ఉండి పోవడంతో సుమారు 40 ఏళ్ల క్రితం స్థానికులు ఓ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి అందులోనే ఉంటున్నారామె. కొందరు దాతలు..విద్యుత్, మంచినీరు వంటి సదుపాయాలతో ఆలయాన్ని అభివృద్ధిచేశారు. సోమవారం, శనివారం భక్తులు వస్తుంటారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తారు. కానీ పద్మావతీదేవి ఒక్కరే... అక్కడ ఉండిపోతారు. తన జీవితం ఆ వైకుంఠనాథుడి పాదాలచెంతే అంటారామె.
కర్పూరమే ఆహారం..
పద్మావతీదేవిలో మరో ప్రత్యేకత ఉంది. ఆమె ఆహారం తీసుకోవడంఎప్పుడో మానేశారట! రెండు పూటలా కాఫీ, దాహం వేస్తే మంచినీళ్లతో సరిపెట్టుకుంటారు. మరి ఆకలేస్తే ఎలా అంటే కర్పూరహారతి మింగేస్తానంటున్నారు. భక్తులు ఎవరైనా పాలు,పళ్లు తెచ్చి ఇస్తే వాటినీ పంచిపెడతానే తప్ప తాను ముట్టను అంటున్నారు పద్మావతీ దేవి. ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదని చెప్తున్నారు. దశాబ్దాలుగా ఆహారం తీసుకోకుండా ఒంటరి జీవితం గడుపుతున్న పద్మావతీదేవిని చూసి.. భక్తులు ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ చదవండి