విజయనగరం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసిన సంఘటన గంటకో మలుపు తిరుగుతోంది. తన బాబాయి ఇంటికి వెళ్తానని శుక్రవారం కళాశాల నుంచి బయల్దేరిన ఆమెను ఎవరు తీసుకొచ్చి పడేశారనేది మిస్టరీగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు స్పృహ రావడంతో... విచారణలో పోలీసులకు కొన్ని వివరాలను వెల్లడించిందని సమాచారం. ‘నేను బాబాయి ఇంటికి వెళ్లకుండా నేరుగా తెర్లాంకు ఆటోలో బయలుదేరా. అప్పటికే అందులో ముగ్గురు అబ్బాయిలు ఉండగా దిగిపోదామనేసరికి వారు బలవంతంగా నన్ను మరో క్యాబ్‌లోకి ఎక్కించారు. రెండు రోజులు వారితో ఉంచుకొని సోమవారం ఉదయం గుర్ల దగ్గర తుప్పల్లో చేతులు, కాళ్లు కట్టేసి పడేసి వెళ్లిపోయారు’ అని వివరించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడయ్యే అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు.
అరుపులు వినిపించడంతో...
సోమవారం ఉదయం గుర్ల పోలీసు ఠాణా సమీపంలోని పొదల్లో నుంచి అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్‌ఐ లీలావతి, సిబ్బంది అక్కడకు చేరుకొని అక్కడ ఓ యువతి పడి ఉండడంతో ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ మంగవేణి ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలు పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. విచారణలో భాగంగా ఆమె విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న తెర్లాం మండలానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవిరావు విలేకర్లకు తెలియజేశారు. ఆ విద్యార్థిని ఘటనా స్థలానికి ఏ విధంగా చేరుకుంది? ఎవరు తీసుకొచ్చారనే విషయాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఆమె ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆరోగ్యం బాగానే ఉన్నా.. షాక్‌లోనే ఉందన్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. అయినా కేసును సుమోటోగా స్వీకరించి రెండు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
‘శుక్రవారం తరగతి గదిలో ఆ విద్యార్థిని పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాం. విజయనగరంలోనే ఉంటున్న తన బంధువుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి సోమవారం వస్తానని చెప్పి వెళ్లింది. అయితే ఆదివారం ఆమె తన ఇంటికి చేరుకోలేదని ఫోను వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది’- కళాశాల ప్రిన్సిపాల్
పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం: జిల్లా ఎస్పీ రాజకుమారి
తెర్లాం మండలానికి చెందిన యువతి.. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఊరికి వెళ్లేందుకు బయలుదేరిన ఆమె.. ఆ తర్వాత ఏం జరిగిందనేది చెప్పలేక పోతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మెరుగైన వైద్యం కోసం యువతిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలిస్తున్నామని.. తదుపరి వివరాలు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వెల్లడిస్తామన్నారు.
ఇదీ చదవండి