ఓ వివాహితను ఆమె ప్రియుడే అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన విజయనగరంజిల్లా గంట్యాడ మండలం కొత్తవెలగాడలో నెలకొంది. గ్రామానికి చెందిన మర్రోతు భవాణి.. భర్త నుంచి విడిపోయి కొంత కాలంగా తన కొడుకుతో కలసి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన చౌడువాడ ఎర్రిబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా కుమారుడు పెద్దవాడు అయ్యాడని... తనతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని భవానీ ఇటీవల చెప్పింది. ఈ మాటలను తట్టుకోలేక ఎర్రిబాబు ఆమెపై కక్షగట్టాడు. సోమవారం అర్ధరాత్రి భవాని ఇంటికొచ్చి నిద్రలో ఉన్న ఆమె తలపై బలంగా మోదాడు. ఫలితంగా భవాని అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఇంటి తలుపులు మూసేసి ఎర్రిబాబు పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న గంట్యాడ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయనగరం రూరల్ సీఐ మంగవేణి, క్లూస్ టీం, గంట్యాడ ఎస్‌ఐ బుద్దల గణేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు.
ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు హంతకుడిని పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి :
ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుళ్లు అరెస్ట్