Youtuber Simhadri: విశాఖ గాజువాకలో నివాసముంటున్న సింహాద్రి అలియాస్ సంజు యూట్యూబర్. అందరి యువకుల్లాగే అతడికీ ఓ బైక్‌పై మోజుండేది. అదే హీరో కంపెనీకి చెందిన స్పోర్ట్స్ బైక్ ఎక్స్‌పల్స్ 4వీ. ఎలాగైనా కొనుక్కోవాలని డబ్బులు పోగు చేసుకుంటూ వచ్చాడు. లక్షా 60 వేల రూపాయలతో బైక్ కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాడు. అందరిలా డబ్బు చెల్లిస్తే కిక్కేముందని భావించిన సింహాద్రి... ఈ మొత్తాన్ని రూపాయి నాణేలతోనే చెల్లించాలని నిర్ణయించుకున్నాడు.
షోరూం యజమాని తెలిసిన వ్యక్తే కావడంతో... ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించాడు. అలాగే బ్యాంకులను సంప్రదించి నాణేలు సమకూర్చుకున్నాడు. ఇలా మొత్తం లక్షా 60 వేల రూపాయి నాణేలతో నింపిన సంచులలో షోరూంకి చేరుకుని... కలల బైక్‌ను సొంతం చేసుకున్నాడు. సింహాద్రితోపాటు అతడి స్నేహితులతో ఉన్న చిరకాల పరిచయం వల్లే... నాణేలు తీసుకుని బైక్ అమ్మక తప్పలేదని షోరూం యజమాని అలీఖాన్ తెలిపారు. నాణేల లెక్కింపు తమ సిబ్బందికి సవాల్‌తో కూడుకున్న పనేనంటూ నవ్వేశారు. రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు ఆలోచన రెండేళ్ల క్రితం వచ్చిందని సింహాద్రి అంటున్నాడు. సవాల్‌తో కూడుకున్న పనే అయినప్పటికీ... కష్టపడి అనుకున్నది సాధించానని సంతోషంగా చెబుతున్నాడు.
రూపాయి నాణేలతో బైక్ కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారని... సింహాద్రి, బైక్ షోరూం యజమాని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ఆ 10 మంది గురువుల పాదాలకు నమస్కరిస్తున్నా: మోదీ