మద్యం మత్తులో జరిగిన చిన్న గొడవ హత్యకు దారి తీసింది. పెందుర్తి పులగవానిపాలెం సమీపంలోని దుర్గా ఆదర్శనగర్‌లో జరిగిన ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇవి. దుర్గా ఆదర్శనగర్‌కు చెందిన కొల్లి లక్ష్మీనారాయణ (22) అలియాస్ సాయి, ఎన్‌ఏడీ సమీప విమాననగర్‌కు చెందిన మేరంగి దిలీప్ (24) అలియాస్ మహేంద్ర, అలియాస్ 8పీఎం ఆటో డ్రైవర్లు. వీరి మధ్య కొన్నాళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. తరచూ కలిసి మద్యం తాగేవారు. అదే క్రమంలో ఆదివారం సాయంత్రం పెందుర్తి వచ్చి కూడలి వద్ద మద్యం తాగారు. తెలిసిన వ్యక్తి ఆటోలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇద్దరూ సాయి ఇంటికి వెళ్లారు. రోడ్డుపై నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకోగా.. సాయిపై దిలీప్ దాడి చేశారు. సాయి రోడ్డు పక్కన ఉన్న రాయితో దిలీప్ తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో సాయి కుటుంబీకులు 108కు సమాచారం అందించారు. తన స్నేహితుడు మేడపై నుంచి పడిపోయాడని వారికి చెప్పాడు. 108 సిబ్బంది వచ్చేసరికే దిలీప్ మృతిచెందాడు. పోలీసులకు సమాచారమందకపోవటంతో సోమవారం ఉదయం వరకు వారు రాలేదు. స్థానికుల సమాచారంతో పెందుర్తి సీఐ కె.అశోక్‌కుమార్, ఎస్‌ఐలు రామమూర్తి, శ్రీను సంఘటన ప్రాంతానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. నిందితుడి పరిచయస్తుల సమాచారం మేరకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీలో తలదాచుకున్న సాయిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ నగరంలోని బాక్సింగ్ క్లబ్‌లో సభ్యుడు. నిందితుడు గతంలో సబ్బవరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఓ హత్యానేరంలో ముద్దాయి. 18 ఏళ్ల వయసులోనే హత్యానేరంలో శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు. సంఘటన ప్రాంతంలో క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి పెందుర్తి సీఐ అశోక్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.
అవే చివరి మాటలు: దిలీప్‌కు అక్క, చెల్లి ఉన్నారు. దిలీప్ మృతదేహాన్ని చూసి తండ్రి గౌరీశంకర్ బోరున విలపించారు. ‘కుటుంబ సభ్యులందరం కలిసి ఆదివారం ఉదయం సింహాచలం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాం. దిలీప్‌ను రమ్మన్నా రానన్నాడు. మరో ఆటోలో వెళ్లాం. మధ్యాహ్నం ఎన్‌ఏడీ కొత్తరోడ్డు వద్ద ఉన్నానని, నగరంలోకి వెళుతున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అదే చివరిసారిగా నాతో మాట్లాడటం. తరువాత ఎన్ని సార్లు చేసిన ఫోన్ కలవలేదు. మాతో పాటు సింహాచలం వచ్చి ఉంటే ఈ విధంగా జరిగి ఉండేది కాదు’ అని గుండెలవిసేలా రోదించారు.
ఇవీ చూడండి...