YCP Leaders Land Kabza in AP: విశాఖ అధికారపార్టీలో కీలకంగా ఉన్న ఓ నేత.. రౌడీ సామ్రాజ్యాన్ని సాగిస్తున్నారు. ఎస్టీడీ బూత్ నడుపుతూ జీవితం మొదలుపెట్టిన ఆయన.. ఆ తర్వాత రౌడీల్ని అడ్డం పెట్టుకుని స్థిరాస్తి వ్యాపారంలో కాలుమోపారు. నగరంలో అత్యంత ఖరీదైన, వివాదాల్లో ఉన్న స్థలాల్నిసెటిల్‌మెంట్లతో చేజిక్కించుకుంటారు.
కైలాసపురం, తాడిచెట్లపాలెం, కప్పరాడ, ఇందిరానగర్, కంచరపాలెం.. తదితర ప్రాంతాల్లో అరాచకమూకల్ని ఆ నేతే పెంచి.. పోషిస్తున్నారు. అలాంటి అరాచక శక్తికి వైసీపీ పెద్దలు అధికార అండదండలు అందించారు. ఓ నామినేటెడ్ పదవి కట్టబెట్టారు. పార్టీ తరఫున ఇంఛార్జి బాధ్యతలూ ఇచ్చారు. ఇంకేముంది.. పోలీసు మొదలు అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లోనూ ఆయన చెప్పినట్టే పోస్టింగులు.
ఒంగోలులో రోజురోజుకూ పెరిగిపోతున్న భూ దందాలు- దొంగ వీలునామాలు, నకిలీ రిజిస్ట్రేషన్లతో కబ్జాలు
ఆయనకు నచ్చని, మాట వినని అధికారులతో బదిలీల బంతాడుకుంటూ.. ఓ అరాచకశక్తిగా ఎదిగారాయన. ప్రభుత్వ నిర్ణయాల్ని ముందే తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లోని భూములను తక్కువ ధరకు కొనేసి.. లబ్ధి పొందడం ఆ అరాచక రాజుకు.. వెన్నతో పెట్టిన విద్య. ఎర్రమట్టి దిబ్బల వద్ద నేరెళ్లవలస సమీపంలో.. రైతులను భయపెట్టి సుమారు 50 ఎకరాల డీకేటీ పట్టా భూముల్ని తీసుకున్నారు.
వాటిని.. భూ సమీకరణ కింద విశాఖ మహానగరపాలక సంస్థకే అప్పగించి.. భారీగా ప్రయోజనం పొందారు. ఆనందపురం-పెందుర్తి టోల్‌గేట్ సమీపంలో.. రైతుల నుంచి కొంత భూమి కొనుగోలు చేసి, పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి కలిపి.. అందులో వెంచర్ వేస్తున్నారు. భీమునిపట్నం సమీపంలో.. ఈయన భాగస్వామిగా ఉన్న ఓ వెంచర్‌కు రోడ్డు అడ్డంగా వస్తోందని ఏకంగా.. వీఎమ్ఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌నే మార్పించేశారు.
తాజాగా నగరంలోని ఓ కాలనీని.. మురికివాడగా గుర్తించి, టీడీఆర్ ఇవ్వాలంటూ అధికారపార్టీకి చెందిన మరో నాయకుడు.. పావులు కదపగా తనకూ టీడీఆర్‌లో వాటా ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుందని అడ్డంకులు సృష్టించి వాటా దక్కించుకున్నారు.
విశాఖపట్నంలోని ఓ నియోజకవర్గంలో.. ఏ చిన్న నిర్మాణం జరగాలన్నా ముందు ఆ నాయకుడికి కప్పం కట్టాల్సిందే. లేదంటే.. అక్కడ ఆయన రౌడీలు వాలిపోతారు. బెదిరించి వాటా వసూలు చేస్తారు. విశాఖ కేంద్రంగా అధికారపార్టీలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ అగ్రనాయకుడికి.. ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జీవీఎంసీలో కీలక పదవిలో ఉన్న ఓ కార్పొరేటర్.. అక్కడ పైరవీలు చేసి, కమీషన్ల ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని.. ఈ నాయకుడి కార్యాలయ నిర్వహణకు వెచ్చిస్తారు.
ఆయన చుట్టూ ఉండే వారంతా.. హత్య కేసులు, ఇతర నేరాల్లో నిందితులే. వాళ్లే కారు డ్రైవర్లు, బౌన్సర్లు, ఇతరత్రా విధుల్లో ఉంటారు. దాదాపు వందమంది ఆయన వద్ద ఉన్నారు. ఆ వంద మంది కూడా ఒక్కొక్కరు పది నుంచి 15మందిని మేపుతుంటారు. ఎక్కడ ఎవరిపై గొడవకు వెళ్లాలన్నా వాళ్లనే పంపుతారు.
రక్షకులే భక్షకులై - వైసీపీ నాయకుల చేతిలో అన్యాక్రాంతమవుతున్న వక్ఫ్ భూములు
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర కోసం విశాఖపట్నం రాగా.. విమానాశ్రయం వద్ద రౌడీమూకల్ని మోహరించి.. ఆటంకాలు కల్పించారు. జనసేన జనవాణి కార్యక్రమానికీ.. రౌడీమూకల్ని పంపించి అల్లరి సృష్టించారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై కోడికత్తి దాడిని నిరసిస్తూ.. విశాఖ విమానాశ్రయంలో పోలీసు స్ట్రైకింగ్ ఫోర్సు జీపు అద్దం పగలగొట్టి.. దాడిచేశారు.
క్రికెటర్ల బస్సునూ అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లోనే కేసు నమోదైనా.. ఇంతవరకూ అభియోగపత్రమే దాఖలు కాలేదంటే.. ఆయన మాఫియా పవరేంటో అర్థంచేసుకోవచ్చు. నగరంలోని ఓ డివిజన్‌కు ఉప ఎన్నికలు జరిగినప్పుడు దొంగ ఓట్లు వేస్తున్నవారిని అడ్డుకున్న జనసేన నాయకురాలిపై.. రౌడీమూక దాడులు చేసింది.
ఓ డివిజన్‌లో శంకుస్థాపన వివాదంలో టీడీపీకి చెందినవారిపై.. రౌడీలతో దాడి చేయించారు. చివరికి తమ సొంతపార్టీ బహిరంగ సభలు,.. నియోజకవర్గ సమావేశాలు, యాత్రల్లోనూ హడావుడంతా ఈ నాయకుడి రౌడీగ్యాంగ్‌దే. అక్కడ ఆయన పట్ల ఎవరైనా వ్యతిరేకత వ్యక్తం చేస్తే.. వెంటనే ఈ గ్యాంగ్ తనదైన పద్ధతిలో వారి నోరు మూయిస్తుంది.