కరోనా మహమ్మారి రోజు రోజుకూ విజృంభిస్తున్న సమయంలో విశాఖ రెడ్‌జోన్‌గా ఉన్న అల్లిపురం ప్రాంతంలో వైకాపాలో చేరికలు కలకలం రేపుతున్నాయి. విశాఖలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు అల్లిపురంలోనే నమోదయ్యింది. ఈ మేరకు అక్కడ నివసించే ప్రజలెవ్వరూ ఇంట్లోనుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ఇవేమి పట్టని కొందరు అల్లిపురం 33వ వార్డుకు చెందిన వైకాపా నాయకులు.. కొల్లి వారి వీధిలో ఉన్న యువకులను పార్టీలోకి ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించారు.
అందులో ఆ ప్రాంత వాసులంతా గుంపులు గుంపులుగా ఒకచోట చేరి వైకాపాలోకి ఆహ్వానించేలా కండువాలు కప్పే దృశ్యాలు సామాజిక మధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కరోనా కష్ట కాలంలో స్థానిక వైకాపా అభ్యర్థులు ఇలా వ్యవహరించడం పట్ల చుట్టుపక్కల ఉన్న నిర్వాసితులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇటువంటివి జరగకుండా.. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: