Visakha Steel Plant workers Padayatra: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం వైఖరిని నిరసిస్తూ కార్యాచరణ ప్రకటించిన కార్మిక సంఘాల నాయకులు దానిని అమలులోకి తీసుకొచ్చారు. ముందుగా ప్రకటించినట్లుగా ఇవాళ ఉదయం నుంచే ఉక్కు మహాసంకల్పయాత్రను ప్రారంభించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటు పరం కాకుండా.. దాన్ని అడ్డుకుని ప్రజల ఆస్తిగానే ఉండేలా ఎంతటి పోరాటానికైనా.. మేము సిద్దమేనని విశాఖ ఉక్కు కార్మికులు.. మరో మారు తమ బలమైన లక్ష్యాన్ని చాటి చెప్పారు. ఈ పోరాటానికి తమకు ఆ దైవమే అండగా నిలవాలని.. ఉక్కు కర్మాగారం పలు కాలనీల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి మెట్ల మార్గం వద్ద ఉన్న తొలి పావంచా వరకు పాదయాత్ర చేశారు.
కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందంటూ.. కార్మిక సంఘాలు ధ్వజమెత్తాయి.. మొదటగా ఈ పాదయాత్ర కూర్మన్నపాలెం నుంచి ప్రారంభమై.. కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, పాత గాజువాక మీదగా.. సింహాచలం దేవస్థానం తొలి పావంచ వరకు కొనసాగింది. పాదయాత్రలో వందల సంఖ్యలో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రతినిధులు.. ఈ యాత్రలో పాల్గొంటున్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకే కేంద్రం ముందుకు వెళ్తోందని.. తాజాగా నిన్న ఉక్కు మంత్రిత్వ శాఖ మరోమారు స్పష్టం చేయడం.. వీరిని మరింతగా కలవరపాటుకు గురి చేస్తోంది.
వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి తాము విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉంచాల్సిన అవసరాన్ని నివేదిస్తామని.. ఉక్కు కార్మిక నేతలు స్పష్టం చేశారు. ప్రైవేటీకరణకు తీసుకునే ఎటువంటి చర్యనైనా తాము అడ్డుకుని తీరుతామన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాదయాత్రలో పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పాటైన ఈ కర్మాగారం బిడ్ అంటూ జరిగితే అందులో ప్రజల తరుఫున తాము బిడ్ దాఖలు చేస్తామని లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం దిగొచ్చే వరకు ఆందోళనలు ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వారు సింగరేణి వాళ్లను పంపించారు. రెండు రోజులు చూసి వెళ్లారు.. బిడ్డింగ్ వేస్తారు.. అని అనుకుంటున్నాం.. ఏపీ ముఖ్యమంత్రి గారిని కుడా నేను విన్నవించుకుంటున్నాను.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల తరపున మీరు బిడ్లు వేయండి.. మన స్టీల్ ప్లాంట్‌ని ప్రభుత్వ రంగ సంస్థగా ఉండనివ్వండి అని కోరుకుంటున్నాను.- లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జేడీ
ఇవీ చదవండి: