విశాఖ జిల్లా చోడవరం మండలం రావికమతంలో విషాదం జరిగింది. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందారు. సింగంశెట్టి వెంకటరమణ, వరలక్ష్మికి 30 ఏళ్ల కిందట వివాహమైంది. సింగంశెట్టి భవాని (51) అనారోగ్యంతో మృతి చెందగా.. ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త వెంకటరమణ (56) గుండెపోటుతో తనువు చాలించారు. భవానికి సంతానం కలగకపోవడంతో భవాని అక్క మనుమడు వర్ధన్ (14)ను దత్తత తీసుకున్నారు. వెంకటరమణ స్థానిక సాయిబాబా గుడి సమీపంలో కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. భవాని మధుమేహం, రక్తపోటు, ఆయాసంతో అనారోగ్యానికి గురయ్యారు.
గురువారం రాత్రి రెండు గంటల సమయంలో ఆయాసం ఎక్కువ కావడంతో చోడవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. విగతజీవిగా మారిన భార్యను చూసి వెంకటరమణ తట్టుకోలేకపోయారు. ఆమె మృతదేహంపై పడి రోదిస్తుండగా గుండెపోటు రావడంతో హఠాన్మరణం చెందారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేరోజు చనిపోవడంతో వర్ధన్ ఒంటరి వాడయ్యాడు. ఇతను తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. దంపతులకు వారి బంధువులుఅంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఆదర్శ దంపతులను కడసారి చూసేందుకు సమీప గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.
ఇదీ చదవండి: