విశాఖ గాజువాక సమీపంలోని మింది గ్రామం వద్ద ఉన్న గోదాముల్లో నిర్మాణాలను ఏపీఐఐసీ అధికారులు తొలగించడం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం కలకలం రేపింది. ఆటోనగర్ ఏ బ్లాకులో సర్వే నంబర్లు 35, 36, 38, 39, 40, 42ల్లో ఉన్న స్థలాన్ని ఏపీఐఐసీ.. ఏటీ రాయుడు అనే వ్యక్తికి కేటాయించింది. ఆ స్థలంలో ఉన్న గోదాములను కొందరు లీజుకు తీసుకున్నారు. వాటిలో బెంజ్ కార్ల షోరూమ్, బిగ్‌బాస్కెట్, అమెజాన్, మైహోమ్ ఫర్నిచర్స్, గాజు సీసాల గోదాము, ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ కేంద్రం, రాఘవేంద్ర లాజిస్టిక్స్ తదితర సంస్థలు ఉన్నాయి. బుధవారం తెల్లవారుజామునే ఏపీఐఐసీ, రెవెన్యూ అధికారులతో పాటు సుమారు 100 మంది పోలీసులు 5 జేసీబీలతో వచ్చి నిర్మాణాల తొలగింపు ప్రారంభించారు.
వ్యాపార సంస్థల యజమానులు, మీడియా ప్రతినిధులను అక్కడికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. తమ కార్యాలయాల్లో విలువైన సామగ్రి, దస్త్రాలున్నాయని.. ముందస్తు సమాచారం లేకుండా ఎలా తొలగిస్తారని యజమానులు వాగ్వాదానికి దిగారు. అక్రమ నిర్మాణాలున్నట్లు గుర్తించి గతంలోనే గోదాం యజమానికి నోటీసులిచ్చామని, స్పందించకపోవడంతో కూల్చివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ముద్రణ కేంద్రం ప్రధాన ద్వారాన్ని, గోడలు, రేకులను తొలగించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ గోదాములను బుధవారం మధ్యాహ్నం పరిశీలించినట్లు జేసీ వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు.
ఇదీ చదవండి: అలా జైలుకెళ్లటం.. ఇలా విడులై మళ్లీ చోరీ చేయటం