మావోయిస్టుల కంచుకోటగా పేరున్న విశాఖ మన్యం బలపం పంచాయతీలో 15 ఏళ్ల తరువాత పెద్ద సంఖ్యలో గిరిజనులు ఓట్లు వేశారు. పోలీసులు పక్కా ప్రణాళికతో వ్యవహరించిన కారణంగా.. గతంలో ఎన్నడూ లేని విధంగా 50.47 శాతం ఓటింగ్ నమోదైంది. 2006లో ఈ పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. 2013లో మావోయిస్టులు హెచ్చరికలతో ఎవ్వరూ నామినేషన్లు వేయలేదు. మళ్లీ 2014 జనవరిలో నోటిఫికేషన్ జారిచేశారు. రాళ్లగెడ్డకు చెందిన సిందేరి కార్ల నామినేషన్ దాఖలు చేయగా.. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఫిబ్రవరి 24న మావోయిస్టులు ఆయన్ను హత్య చేశారు.
అనంతరం.. సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ.. ఎవ్వరూ నామినేషన్ దాఖలు చేయలేదు. ఈ ఏడాది చివరి రోజు వరకూ ఎవ్వరూ నామినేషన్ వేయలేదు. చివరి రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. సర్పంచ్ పదవికి మాత్రమే పోలింగ్ జరిగింది. 50.47 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో గ్రేహౌండ్స్, ఏపీఎస్‌పీ, సీఆర్‌పీఎఫ్ పోలిసులు భారీగా మోహరించారు.
ఎన్నికల రోజు ఏఎస్‌పీ విద్యాసాగరనాయుడు స్వయంగా ద్విచక్రవాహనంపై బలపం పంచాయతీ పరిధిలో పర్యటించి ఓటర్లను చైతన్యవంతులు చేశారు. ఓటింగ్‌లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకున్నారు. ఓటు వేయడం మానేస్తే పంచాయతీ అభివృద్ది కుంటుపడుతుందని, పంచాయతీకి సర్పంచ్ ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గిరిజనులకు అవగాహన కల్పించారు. ఈ చర్యలు ఫలితాన్నిచ్చి.. ఓటింగ్ బాగా జరిగింది.
ఇదీ చదవండి: