Volunteer Wife Allegations on YCP Sarpanch: విశాఖ జిల్లా పద్మనాభం మండలం రైతుల పాలెంలో గత నెల 22న మాజీ సైనికుడు ఆదినారాయణ పై జరిగిన హత్యాయత్నం కేసు పలు మలుపులు తిరుగుతోంది. బాధితుడి వాంగ్మూలంలో వైసీపీ సర్పంచ్ కుమారుడు కోన రమణ, కోన రాజులు కత్తులు రాడ్లతో హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. అయినప్పటికీ సీఐ హత్యయత్నం కేసు పెట్టకుండా.. నిందితులను సులువుగా తప్పించే సెక్షన్లను నమోదు చేశారని బాధితుడు ఆదినారాయణ ఆరోపించాడు. దీనికి తోడు రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సేవా సంఘం సభ్యులు గత నెల 27న పద్మనాభం పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. బాధితులు వాంగ్మూలంలో స్పష్టంగా కత్తులు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదు చేసినప్పటికీ, 307 సెక్షన్ హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రైతుల పాలెం గ్రామంలో కోన రమణ ప్రభుత్వ భూములు, కాలువలు తన పేరిట, తన బంధువుల పేరిట ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని, తాను స్పందనలో ఫిర్యాదు చేయడంతోనే తనపై దాడి చేసినట్లు ఆదినారాయణ తెలిపారు. హత్య చేయడానికి దుండగులను ఏర్పాటు చేసిన సర్పంచ్ కుమారుడితో పాటు దాడికి పాల్పడిన వారిపైనా చర్యలు తీసుకోవాలని అదినారాయణ డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే, ఈ ఘటనకు సంబంధించి పై ఉన్నతాధికారులు స్పందించడంతో పోలీసులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. ఇప్పటికే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కోన రమణ, కోన రాజులు పరారిలో ఉన్నారు. భీమునిపట్నం మండలం లక్ష్మీపురం సచివాలయ వాలంటీర్ కుప్ప రాంబాబును అదుపులో తీసుకునేందుకు గత నెల 31న పద్మనాభం పోలీసులు వెళ్లారు. వాలంటీర్ ఇంటివద్ద లేకపోవడంతో వాలంటీర్ కుటుంబసభ్యులను పోలీసులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ భార్య పెట్రోల్ డబ్బాతో వైసీపీ సర్పంచ్ కుమారుడు కోన రమణ ఇంటిముందు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. చుట్టుపక్కల వారు అడ్డగించడంతో ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా వాలంటీర్ భార్య సంతోషి మాట్లాడుతూ.. వైసీపీ సర్పంచ్ కుమారుడు కోన రమణ తన భర్త రాంబాబును కారులో ఎక్కించుకొని రఘు అనే వ్యక్తితో తీసుకువెళ్లారని తెలిపింది. తన నా భర్తను అప్పగించాలని డిమాండ్ చేసింది. కేవలం తమను మాత్రమే విచారణకు పిలుస్తున్నారని పేర్కొంది. ఈ కేసులో పోలీస్ స్టేషన్కు పిలిపించి ఇష్టం వచ్చినట్లు వేధించారని కన్నీరు మున్నీరుగా విలపించింది. ప్రధాన నిందితుడిగా ఆరోపణలలో ఎదుర్కొంటున్న కోన రమణ భార్య, తల్లిదండ్రులను ఎందుకు పోలీస్ స్టేషన్కు పిలిచి ప్రశ్నించడంలేదని ప్రశ్నించింది. తాము అమయాకులమని, తమను పోలీసులు వేదిస్తున్నారని వాలంటీర్ భార్య కన్నీటి పర్యాంతం అయ్యింది. తన భర్త వాలంటీర్ ఉద్యోగం కూడా పోతుందని, తాము ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది.