గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు చనిపోయారు. అందులో ఒకరు కుందన శ్రేయ (6). ఈ చిన్నారిని కేజీహెచ్‌కు తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ సమాచారం తెలుసుకుని ఆ చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రికి వచ్చారు. దుర్ఘటనలో చనిపోయిన వారిని పోస్టుమార్టం చేస్తారని తెలుసుకున్న వారు కుప్పకూలిపోయారు. ‘పాపకు పోస్టుమార్టం వద్దయ్యా..’ అంటూ పోలీసుల్ని, వైద్యుల్ని బతిమాలారు. రోగుల్ని పరామర్శించేందుకు వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు కేజీహెచ్‌కు రావడంతో ఆ పాప బంధువులు ఆయన్ని కలిసి ప్రాధేయపడ్డారు. ఆ తర్వాత కుటుంబీకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు వారికి సర్దిచెప్పారు.
పడకకు ఇద్దరు, ముగ్గురు..
ఘటనలో సొమ్మసిల్లిన మరో 44 మంది పసిపిల్లల్ని అంబులెన్సుల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు. వారందరిలో కళ్లు మండటం, తల తిరగడం, అపస్మారక స్థితికి చేరడం లాంటి సమస్యలు కనిపించాయి. వచ్చిన పిల్లల్లో ఎక్కువ మంది చిరునామాలు తెలియడం లేదని వైద్యులు చెప్పారు. కొన్నిగంటల తర్వాత పిల్లలు స్పృహలోకి వచ్చినా తమ వారు కనిపించక ఆందోళనకు గురై రోదించారని తెలిపారు. పిల్లల వార్డులో ఒక్కో పడకపై ఇద్దరు, ముగ్గుర్ని ఉంచాల్సిన పరిస్థితి. కేజీహెచ్‌కు వచ్చిన పిల్లలందరూ 12ఏళ్ల లోపు వారే.
ఇవీ చూడండి...