విశాఖ ఉక్కు కర్మాగారం మెడికల్ అక్సిజన్ అందిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. కొవిడ్ బారిన పడిన వారి ప్రాణాలను నిలబెట్టడంలో తన వంతు పాత్ర పోషిస్తోంది. కొవిడ్‌పై పోరులో ఆక్సిజన్ పాత్ర అద్వితీయం. రోగి ఆరోగ్యం క్షీణించినప్పుడు కృత్రిమ శ్వాస అందిస్తారు వైద్యులు. ఈ క్రమంలో వైద్య అవసరాల కోసం ఉక్కు కర్మాగారం ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు 4000 టన్నుల ద్రవ రూప అక్సిజన్ ఉత్పత్తి చేసి రాష్ట్రంలోని ఆసుపత్రులకు అందించింది. ఇది అత్యంత నాణ్యంగా ఉండటం వల్ల వైద్య అవసరాల కోసం బాగా ఉపయోగపడుతోంది. ఈ విషయాన్ని విశాఖ ఉక్కు కర్మాగారం అధికారులు ట్విటర్ ద్వారా వెల్లడించారు.
స్వయంగా ఉత్పత్తి
విశాఖ ఉక్కు కర్మాగారంలో పనులకు ఆక్సిజన్‌ను ఎక్కువగా వినియోగించాల్సి ఉంటుంది. బ్లాస్ట్ ఫర్నేస్, ఆక్సిడేషన్ ప్రక్రియలోనూ ఈ వాయువును వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని టన్నుల ఆక్సిజన్‌ను ఉక్కు ఉత్పత్తికి వినియోగిస్తారు. ఇదంతా ఉక్కు కర్మాగారం స్వయంగా తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆక్సిజన్ ఉత్పత్తి చేయాలంటే కేంద్రం విధించిన కఠినమైన నిబంధనలను పాటిస్తేనే అనుమతి లభిస్తుంది. ఇప్పటికే స్టీల్ ప్లాంట్‌లో ఆ సదుపాయం ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కొవిడ్ బాధితుల ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన మెడికల్ అక్సిజన్ తయారీకి విశాఖ ఉక్కు కర్మాగారం చర్యలు చేపట్టింది.
మరింత అందించేందుకు కార్యాచరణ
ఇప్పటివరకు సరఫరా చేసిన 4000 టన్నుల ద్రవ రూప అక్సిజన్కి అదనంగా రాష్ట్ర ప్రభుత్వ అవసరాల మేరకు ఉత్పత్తి చేసి అందించేందుకు స్టీల్ ప్లాంట్ కార్యాచరణ అమలు చేస్తోంది. ఈ అక్సిజన్ నాణ్యతపై రాష్ట్ర ఔషధ నియంత్రణ శాఖ కూడా సంతృప్తి వ్యక్తం చేసింది.