విశాఖ ఉక్కు ఉద్యమం.. ఆంధ్రుల ఆత్మగౌరవ అంశంగానే కాక.. ప్రభుత్వరంగ సంస్థల ఉనికి పరిరక్షించే సాధనంగానూ చూడాల్సిన అవసరముందని కార్మిక సమాజం అభిప్రాయపడుతోంది. ఎన్నో త్యాగాల ఫలంగా దక్కిన ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం.. దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల భవితను నిర్దేశిస్తుందని.. వాటినీ కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని అన్నారు.
పరిశ్రమను ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలన్న డిమాండ్‌తో సాగించే ఉద్యమానికి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేకుండా కార్యాచరణ సిద్ధమవుతోందని.. రాజకీయ పార్టీలు, కార్మికసంఘాలు ఇదే లక్ష్యానికి కట్టుబడి ఉండాలని కోరుతున్నారు.
ప్రైవేటీకరణను అడ్డుకునే కార్యాచరణతో ప్రత్యేక కేబినెట్, శాసనసభ సమావేశాలు నిర్వహించి.. ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని.. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రిని కోరారు. ఈ అంశమై అఖిలపక్షం ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం సాధించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానికి లేఖ రాసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని .. ఉత్తరాంధ్రకు చెందిన విశ్రాంత ఉపకులపతులు, ఆచార్యులు, ఐఏఎస్ అధికారులు ప్రధానికి లేఖ రాశారు. ప్రభుత్వరంగంలో ఉన్న భారీ పరిశ్రమను కాపాడుకోవడమే తమ ఉద్దేశమన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రజాగ్రహాన్ని చూస్తారని ప్రధానికి రాసిన లేఖలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజ శర్మ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఐపీఎల్ నుంచి వివో పూర్తిగా.. కారణమిదే!