ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఇసుకపై విశాఖ జిల్లా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన ఇసుక రాకపోవడం, ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ నిల్వ కేంద్రాల నుంచి కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. అనుకున్న సమయానికి అందించడం, కోరుకున్నది సరఫరా చేయడంతో చాలామంది ఒడిశా నుంచి ప్రైవేటుగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో రోజుకి 8 వేల టన్నుల వరకు వినియోగదారులకు ఇసుక సరఫరా చేసిన అధికారులు ఇప్పుడు 3 నుంచి 4 వేలకు మించి చేయడం లేదు. ప్రస్తుతం జిల్లాలో తగినంత ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజల నుంచి డిమాండు మాత్రం కనిపించడం లేదు. గతంలో రోజుకు 500 లారీల వరకు పెండింగ్ ఉండగా ఇప్పుడు 40కి మించడం లేదు. ముఖ్యంగా విశాఖలో ప్రభుత్వం సరఫరా చేసే ఇసుక ధర అధికంగా ఉండడమే కారణమని చెబుతున్నారు. కొత్త విధానం వచ్చినంత వరకు ఈ ఇబ్బందులు తప్పేలా లేవు.
ఒడిశా నుంచి..
విశాఖకు ఒడిశాలోని కాశీనగర్, రాయఘడ, కటక్ ఇతర ప్రాంతాల నుంచి ఇసుక వస్తోంది. కటక్ విశాఖకు 440 కి.మీ., రాయఘడ 240, కాశీనగర్ 190 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నీ విశాఖకు సుదూరమైనప్పటికీ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ ఆధారంగా లారీ యజమానులు పోలీసుల కళ్లుగప్పి రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా వినియోగదారులకు(మెత్తటి, గరుకు) ఏది కావాలంటే అది సరఫరా చేయడంతో ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. కొందరు బిల్డర్లు అపార్టుమెంట్ల నిర్మాణానికి బల్క్‌గా తెప్పించుకుంటున్నారు.
విశాఖ నుంచి సరకు రవాణాతో ఒడిశా వెళ్లే లారీలు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా ఇసుక తీసుకొస్తున్నారు. కొందరైతే ప్రత్యేకంగా ఒడిశా నుంచి ఇసుక తెచ్చేందుకే లారీలు నడుపుతున్నారు. కొందరు ఎన్‌వోసీలు తీసుకొని వస్తుండగా మరికొందరు అర్ధరాత్రులు తరలిస్తున్నారు.
మధ్యవర్తులుగా ఏర్పడి..
ఒడిశా ఇసుక వ్యాపారానికి కొందరు మధ్యవర్తులుగా ఏర్పడుతున్నారు. ప్రైవేటు స్టాకు పాయింట్లు బయటకు తెలియకుండా మధ్యవర్తుల సాయంతో ఇసుక వ్యాపారం సాగిస్తున్నారు. ఇందుకు కొంత కమీషన్ సైతం తీసుకుంటున్నారు. వినియోగదారులు వారికి ఎప్పుడు, ఎక్కడికి సరఫరా చేయాలో చెబితే చాలు ఆ సమయానికి చేరవేసేలా చూస్తారు. అంతేకాకుండా నచ్చిన ఇసుక తెప్పించి లారీ వచ్చినప్పటి నుంచి ఇసుక దించేవరకు అన్ని పనులు వారే దగ్గరుండి చూసుకుంటున్నారు.
తక్కువ ధరకు సరఫరా చేయడంతో..
ఎక్కువమంది ఒడిశా ఇసుక వైపు మళ్లడానికి ప్రభుత్వ ఇసుక కన్నా రూ.వందా, రెండొందలు తక్కువకు అమ్మడం ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రభుత్వ ధర ప్రకారం విశాఖలో ప్రస్తుతం టన్ను ఇసుక రూ.1500, అదే ఒడిశా నుంచి వచ్చినది రూ.1200 నుంచి రూ.1400 మధ్యలో అమ్ముతున్నారు. దీనివల్ల 30 టన్నుల లారీ మీద రూ.2,3 వేల వరకు మిగులుతుంది.
ప్రస్తుతం ప్రజల నుంచి డిమాండు తగ్గిందని, నాణ్యమైన ఇసుకను సమయానికి అందిస్తున్నా ఒడిశా నుంచి తెస్తున్న ఇసుకను తక్కువకు ఇస్తుండడంతో కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోందని అధికారులు అంటున్నారు.
ఇసుక రేవు ప్రాంతం | నిల్వ ఉన్న ఇసుక (మె.టన్నుల్లో) |
ముడసర్లోవ | 1,60,000 |
అగనంపూడి | 55000 |
అనకాపల్లి | 35000 |
అచ్యుతాపురం | 3000 |
చోడవరం | 19000 |
ఇదీ చదవండి: దమ్ముంటే నా పర్యటనను అడ్డుకోండి: పవన్