"గోలీ సోడా కొట్టడం అంటే.. పీజీ పాసైనంత ఈజీ కాదు" అంటాడు ఎమ్మెస్ నారాయణ ఓ సినిమాలో. మన లైఫ్ లోనూ అనుకున్నంత ఈజీగా ఐపోవు ఏ పనులైనా. ఇక, వ్యాపారం అయితే.. మరీను. ఎన్నో ఆలోచనలు, పరిశోధనలు, ప్రయోగాలు.. వీటికి అదనంగా ఎదురయ్యే ప్రతీ సమస్యను తట్టుకుని నిలబడాలి. ఇవన్నీ సమర్థవంతంగా చేసి చూపించారు విశాఖకు చెందిన నలుగురు యువకులు. వారే.. ఈ లూపిన్ గోలీసోడా వ్యవస్థాపకులు.
ధర్మశేఖర్ రెడ్డి, నాగేంద్ర, చాణిక్య, జ్ఞానేశ్వర్ స్నేహితులు. ఉన్నత విద్య పూర్తి చేసి వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరంతా కలిసి వ్యాపారం చేయాలనుకున్నారు. ఆ సమయంలోనే చిన్నప్పటి గోలీ సోడా గుర్తొచ్చింది. మార్కెట్లో విదేశీ కూల్‌డ్రింక్స్ పోటీ పెరిగిపోవడంతో డీలా పడ్డ గోలీ సోడాలకు తిరిగి ప్రజల్లోకి తీసుకు రావాలనుకున్నారు ఈ యువకులు. వివిధ చోట్ల తిరిగారు. ఆనాటి గోలీసోడాల్లో వినియోగించిన పదార్థాలు, తయారీని తెలిసుకున్నారు. వాటి ఆధారంగా తమ సోడాల ఉత్పత్తికి కావాల్సిన పరికరాల్ని సమకూర్చుకున్నారు. తమ ఉత్పత్తులు పూర్తి పర్యావరణహితంగా ఉండాలని కోరుకున్న వీరు ప్లాస్టిక్‌కు దూరంగా, గాజు సీసాలను ఎంచుకున్నారు. సోడాల్లో రసాయన రంగులు, ప్రిజర్వేటీవ్‌లు కలుపకుండా స్థానికంగానే సోడాలు ఉత్పత్తి చేస్తున్నారు.
ఐదు రకాల రుచుల్లో..
ఐదు రకాల రుచుల్లో లూప్స్ సోడాలను తయారు చేశారు. పాత గోలి సోడానే ప్రజలకు అందించాలని లక్ష్యంతో... ప్రతీ దశలో నాణ్యతకు పెద్ద పీట వేశారు. ముడి పదార్థాల వినియోగంలో ఐఎస్ఐ మార్క్‌ని వినియోగించారు. యూరోప్ ప్రమాణాలతో బాటిలింగ్ తయారు చేశారు. ఈ దశలోనే చాలా మంది వీరిని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. మార్కెట్ పోటీ, శీతలపానియాల ధరలు, ట్రెండ్ అంటూ నిరుత్సాహపరిచారు. కానీ...తమ ఉత్పత్తిపై నమ్మకంతో ముందుకు కదిలారు. ఐదు రుచుల్లో తొలుత 250 బాటిల్స్‌తో వ్యాపారం మొదలు పెట్టారు. అందరికీ అందుబాటు ధరలు ఉండడంతో పాటు... స్థానికులకు రుచికి నచ్చడంతో వేగంగా అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా సమయంలోనూ రోజుకు వెయ్యికి పైగా సీసాలు విక్రయించగా.. నేడు 5 వేల బాటిల్ల గోలీ సోడాను అమ్ముతున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి విజయాన్ని సాధించారు. 50 మందికి ప్రత్యక్షంగా, మరెంతో మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు.
బయటి దుకాణాలతో పాటు నిరుద్యోగ యువత, వృద్ధులకు సోడాల విక్రయానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అందిస్తూ... మారుమూలలకూ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. విభిన్న రీతుల్లో ప్రజలకు చేరువయ్యేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారు. నగర యువత సైతం.. బ్రాండెడ్ శీతల పానీయాల లాగే వీరి గోలీ సోడా ఆస్వాదిస్తున్నారు.
ఇదీ చదవండి