విశాఖ భూ కుంభకోణంపై ప్రభుత్వానికి ప్రత్యేక దర్యాప్తు బృందం మధ్యంతర నివేదిక సమర్పించనుంది. విశాఖ పరిసర మండలాల్లో భూముల ఆక్రమణలు, ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం సహా, పలు అంశాలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన సిట్... వాటిని తమ పరిధిలోకి వచ్చే అంశాలకనుగుణంగా వర్గీకరించింది. ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యింది. మూడు నెలల్లో నివేదికను ఇవ్వాలని ఈ బృందాన్ని ప్రభుత్వం నిర్దేశించగా... ఇప్పటికే దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర నివేదిక సిద్ధం చేశారు. దీనిని సమర్పించే సమయంలోనే పూర్తి నివేదికకు మరింత గడువు కావాలని కూడా అభ్యర్థించనుంది. ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు, రెవెన్యూ రికార్డులు, వెబ్లాండ్లో మార్పులు, మాజీ సైనికులు తమ భూములను అమ్ముకునేందుకు నిరభ్యంతర పత్రాల జారీ వంటి అంశాలను సిట్ పరిశీలిస్తుంది. ప్రభుత్వ భూమి కబ్జాలు, వివిధ వ్యక్తులు, సంస్థలు నిర్దేశించిన విధానం పాటించకుండా భూమిని దఖలు పర్చిన కేసులను ఈ సిట్ పరిశీలిస్తుంది. భూ రికార్డులను తారుమారు చేసిన అధికార, అనధికార వ్యక్తులను కొందరిని కూడా గుర్తించినట్టు సమాచారం.
ఇదీ చదవండి