ఆంధ్ర - ఒడిస్సా సరిహద్దు సింగారంలో జరిగిన ఎన్కౌంటర్ బూటకపు ఎన్కౌంటర్ అంటూ మల్కనగిరి కోరాపుట్ - విశాఖ (ఎంకేవీ) డివిజన్ కార్యదర్శి కైలాసం పేర్కొన్నారు. ఈమేరకు ఆడియో రికార్డును విడుదల చేశారు. కటాఫ్ అటవీ ప్రాంతంలో సేదతీరుతూ ఉండగా ఒడిశా బీఎస్ఎఫ్ బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరిపారని ఆడియోలో ఆరోపించారు. ఈ ఘటనలో మల్లేష్, శాంతమ్మ ఇద్దరు అమరులయ్యారన్నారు. మరో ఇద్దరిని తమ వెంట తీసుకువెళ్లినట్లు తమ వద్ద సమాచారం ఉందన్న ఆయన వారిని వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా ప్రజల మౌలిక సమస్యలపై పోరాడుతున్న తమపై జరిపిన కాల్పులను అందరూ ఖండించాలని కోరారు.
కాల్పుల్లో మృతి చెందిన మల్లేష్ గత 18 ఏళ్లుగా విశేష సేవలందిస్తూ గుమ్మాదళ సభ్యునిగా ఎదిగారని గుర్తుచేశారు. అలాగే శాంతమ్మ ఆరు నెలలుగా దళంలో కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌లో జంత్రీ కటాప్ ప్రాంతంలో నీటిలో పడిపోయిన తమ సభ్యుడిని బయటకు తీసి చంపారని గుర్తు చేశారు. పోలీసులు ఏకపక్షంగా చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను మేధావులు ప్రజలు ఖండించాలని కైలాసం ఆడియో వాయిస్‌లో చెప్పారు. పోలీసులు బందీలుగా తీసుకువెళ్లిన ఇద్దర్ని వెంటనే కోర్టులో హాజరు పర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి...