Kidney Racket Investigation: కలకలం సృష్టించిన విశాఖ కిడ్నీ రాకెట్ కేసును పోలీసులు ఛేదించారు. డాక్టర్ పరమేశ్వరరావు సహా మరో ఐదుగురు దళారుల్ని అరెస్టు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, కుటుంబాలే లక్ష్యంగా ఈ ముఠా దందాకు తెర లేపినట్లు గుర్తించారు. కీలక సూత్రధారి నార్ల వెంకటేశ్వరరావు ఆధ్వర్వాన తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ ఆపరేషన్లు జరిగినట్లు తేల్చారు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తులు, కుటుంబాలపై కన్నేస్తారు. కిడ్నీ ఇస్తే లక్షల్లో డబ్బు చెల్లిస్తామని ఆశ చూపుతారు. భయపెట్టో, బలహీనతను ఆసరాగా చేసుకునో... లేదంటే బలవంతంగానైనా కిడ్నీలు తీసుకుంటారు. ఇటీవల విశాఖలో సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వెనుకున్న ముఠా దందా సాగిన తీరిది. ఈ కేసులో డాక్టర్ పరమేశ్వరరావుతోపాటు దళారులు కామరాజు, శ్రీను, శేఖర్, ఎలీనా, కొండమ్మను అరెస్ట్ చేసినట్లు... విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు.
తిరుమల ఆసుపత్రిలో వినయ్ కుమార్, వాసుపల్లి శ్రీనివాస్‌రావుకు ఆపరేషన్ జరిగిందన్న పోలీసులు.... నిందితులపై 307, 326, 420తో పాటు అనధికారిక తొలగింపు చట్టం నిబంధనల ఉల్లంఘన కింద కేసులు పెట్టామన్నారు. ఈ కేసులో కీలక సూత్రధారి నార్ల వెంకటేశ్వరరావు గతంలోనూ కిడ్నీ రాకెట్ కేసులో జైలుకు వెళ్లాడని వెల్లడించారు.
కిడ్నీ ఇస్తే ఎనిమిదిన్నర లక్షలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారంటూ మధురవాడ వాంబే కాలనీకి చెందిన డ్రైవర్ వినయ్‌కుమార్ ఫిర్యాదుతో... ఈ కిడ్నీ దందా వెలుగులోకి వచ్చింది. శ్రీను, కొండమ్మకు తన ఆర్థిక కష్టాలు చెప్పుకుంటే, కిడ్నీ విక్రయిస్తే భారీగా డబ్బులు వస్తాయంటూ కామరాజు, ఎలీనాను పరిచయం చేశారని బాధితుడు పేర్కొన్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో వెనక్కి తగ్గానని... అయినా తనను బెదిరించి మరీ గత డిసెంబర్‌లో తిరుమల ఆసుపత్రిలో సర్జరీ చేసి ఒక కిడ్నీ తీసుకున్నారని వాపోయాడు. ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వకుండా కేవలం 2 లక్షల 50 వేలతో సరిపెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేయడంతో.. కిడ్నీ రాకెట్ గుట్టు బయటపడింది.
'విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులు అరెస్టయ్యారు. ఇద్దరు బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదుల అధారంగా దర్యాప్తు చేశాం.కీలక సూత్రధారి నార్ల వెంకటేశ్వరరావు గతంలోనూ కిడ్నీ రాకెట్ కేసులో జైలుకు వెళ్లాడు. ఇతని ద్వారానే అంతా జరిగింది. నిందితులపై 307,326,420లతో పాటు అవయవమార్పిడి చట్టం 1995 ప్రకారం ఉల్లంఘనలపై కేసు నమోదు చేశాం'-. త్రివిక్రమ్ వర్మ, విశాఖ నగర పోలీస్ కమిషనర్
ఇవీ చదవండి: