వెంకటాపురం గ్రామం... ఒక్క రాత్రిలో ఊహించని నష్టాన్ని చవి చూసింది. రసాయన వాయువు వారి జీవితాల్లో కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఈ దుర్ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన వారు, ప్రాణాలు అరచేత పట్టుకుని చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయిన వారు... ఇప్పుడిప్పుడే గ్రామంలోకి అడుగు పెడుతున్నారు. అక్కడి పరిస్థితులను చూసి తల్లడిల్లిపోతున్నారు. వెంకటాపురంలోకి ప్రవేశం లేనందున పోలీసులు అనుమతించడం లేదని... పొలంగట్లు దాటుకుని వస్తున్నామని గ్రామస్థులు చెబుతున్నారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే కనీసం తాగేందుకు మంచి నీరు కూడా లేదని వాపోతున్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోని సౌకర్యాల పైనా గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక ఫుట్‌పాత్‌ల పైనే కాలయాపన చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామంలో రసాయన వాయువు ప్రభావం తగ్గుముఖం పడుతోందని... మరి కొన్నిచోట్ల గాలిలో స్టైరిన్ శాతం జీరో పీపీఎంగా నమోదవుతోందని అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని వెంకటాపురం ప్రజలు చెబుతున్నారు. గ్రామంలో స్టైరిన్ వాయువు ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా ఉందని అంటున్నారు. గాలిలో ఈ విషవాయువు ప్రభావాన్ని తగ్గించే దిశగా తక్షణమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించే పరిహారం విషయంలో అవసరమైన పత్రాల కోసం ఇక్కడి ప్రజలకు ఇక్కట్లు మాత్రం తప్పడం లేదన్నారు. గుండెలు అలిసేలా పోరాడి ప్రాణాలు కాపాడుకుని విశ్రాంతి తీసుకుంటున్న వారికి... పరిహారం కావాలి అంటే సంబంధిత పత్రాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేయటంతో... కొందరు తిరిగి గ్రామాలకు వస్తున్నారు. ఇక తమవాళ్లు అంతా ఆసుపత్రిలో ఉంటే ఓ వృద్ధుడు మాత్రం ప్రాణాలతో బయటపడి... ఖాళీ అయిన ఊరిలో ఉంటున్నాడు. కనీసం తినడానికి ఆహారం కూడా ఎవరూ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఊహించని కష్టంతో కొండంత విషాదాన్ని గుండెలో నింపుకొన్న తమ పట్ల కంపెనీ యాజమాన్యం, ప్రభుత్వం మరింత ఔదార్యంగా వ్యవహరించాలని బాధిత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చూడండి: