విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ఉక్కు మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని కార్మిక నేతలు మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టడంలో కార్మికుల కష్టం ఏమీ లేదంటూ కార్మికుల కష్టాన్ని చులకన చేసేలా మంత్రి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల 28, 29న తలపెట్టిన.. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. విశాఖలో ఈనెల 28న తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేయాలని కోరారు.
"విశాఖ ఉక్కుపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు సరికాదు. కార్మికులను చులకన చేసే మాటలను వెనక్కి తీసుకోవాలి. స్టీల్‌ప్లాంట్ లాభాల బాట పట్టిందంటే అది కార్మికుల కష్టమే. విశాఖ ఉక్కుపై ఈ నెల 28, 29న దేశవ్యాప్త సమ్మె. ఈ నెల 28న విశాఖ బంద్. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం." -నరసింగరావు, పోరాట సమితి ఛైర్మన్
కేంద్ర మంత్రి ఏమన్నారంటే..: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ఏపీ ఎంపీలు గళమెత్తారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం అశాస్త్రీయమని నిలదీశారు. నష్టాల కారణం చూపి ప్లాంట్‌ను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనుకునే ప్రయత్నాలను మానుకోవాలని కేంద్రాన్ని కోరారు. గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్‌ను లాభాల బాట పట్టించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం సరికాదని దీనిపై పునరాలోచించాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు కాప్టివ్ మైన్స్ లేవని.. మైన్స్ కేటాయిస్తే లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఉద్యమం చేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ సరికాదని ఎంపీ కేశినేని నాని అన్నారు. సెయిల్‌ను కాకుండా విశాఖ ఉక్కును మాత్రమే ప్రైవేటీకరణ చేయడమేంటని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రధాని మోదీ పునరాలోచించాలని వైకాపా ఎంపీ మార్గాని భరత్ విజ్ఞప్తి చేశారు. కాప్టివ్ మైన్స్ కావాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ఎంపీలకు బదులిచ్చిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించనప్పటికీ కొంత కాలం పరిశ్రమ లాభాల బాటలో పయనించిందని బదులిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటీకరణే ఉత్తమ నిర్ణయమని చెప్పారు.
ఇదీ చదవండి: Nara Lokesh : సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్.. ఏమన్నారంటే?