Union Minister Narayana Swamy inaugurated Games in Visakhapatnam : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక శాఖ సహాయ మంత్రి ఏ.నారాయణస్వామి అన్నారు. విశాఖలో అఖిల భారతీయ విద్యా భారతి శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో 34వ జాతీయ బాస్కెట్ బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో నారాయణస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారతీయ విద్యా కేంద్రం ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఏ.నారాయణస్వామి మాట్లాడుతూ భారతదేశం క్రీడల్లో దూసుకుపోతోందన్నారు. విద్యార్థులు క్రీడల్లో తమ సత్తా చాటే విధంగా రాణించాలని మంత్రి నారాయణ స్వామి కోరారు.
భారతీయ క్రీడా రంగం వెనుకబడిన స్థాయి నుంచి నేడు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ ప్రోత్సాహంతో యువతీ, యువకులు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను చాటుతున్నారన్నారు. ఆసియా క్రీడల్లో వందకు పైగా పతకాలు సాధించి దేశ ఖ్యాతిని పెంచారని తెలిపారు. విద్యార్థులు తమకు, తల్లిదండ్రులకు, చదివే విద్యాలయాలకు, తమ ప్రాంతాలకు పేరు తేవడమే కాక క్రీడలను తమ వృత్తిగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు విశాఖ వేదిక కావడం అనందంగా ఉందన్నారు. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ జాతీయ స్థాయిలో రాణించేలా విద్యార్థులను ప్రోత్సహించడమే లక్ష్యమని నారాయణ స్వామి తెలిపారు. క్రీడలలో అసాధారణమైన ప్రతిభ, నైపుణ్యాన్ని ప్రదర్శించి, జాతీయ క్రీడాకారులుగా ఎదగాలని ఈ సందర్భంగా మంత్రి ఆకాంక్షించారు.
విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ అండర్ 14, 17, 19 విభాగాల్లో బాల బాలికల ఛాంపియన్ షిప్ కు విశాఖ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. ఈ నెల 13నుంచి 16 వరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా విద్యాభారతి విద్యాలయాల నుంచి 500 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. చంద్రపాలెం జడ్పీహై స్కూల్ లో కాకుండా నాలుగు చోట్ల ఈ క్రీడలు నిర్వహిస్తున్నారు. మొత్తం 42 జట్లు పాల్గొంటున్న ఈ పోటీలలో 23 బాలుర జట్లు,19 బాలికల జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు వెల్లడించారు.
విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ ఆధ్వర్యంలో బాస్కెట్ బాల్ పోటీలు జరుగుతున్నాయి. అండర్ 14, 17, 19 విభాగాల్లో బాల బాలికల ఛాంపియన్ షిప్ కు విశాఖ జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ సాంకేతిక సహకారం అందిస్తోంది. మొత్తం 40 జట్లు వచ్చాయి. నిర్వాహకులు చక్కని ఏర్పాట్లు చేశారు. విశాఖలో ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించడం సంతోషకరం. యువతను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న విద్యాభారతి సంస్థలను అభినందిస్తున్నా. - ఏ.నారాయణస్వామి, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిక శాఖ సహాయ మంత్రి