Kishan reddy at vishaka: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్ని జులై 4న ప్రారంభించి ఏడాదిపాటు కొనసాగిస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం విశాఖలో అల్లూరి వర్ధంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అల్లూరి చరిత్రను భారతదేశం మొత్తం పరిచయం చేయాలని భావిస్తున్నామని, దిల్లీ, హైదరాబాద్, భీమవరం, రాజమహేంద్రవరం, మరికొన్ని చోట్ల జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియం నిర్మిస్తున్నామని తెలిపారు. జయంతి ఉత్సవాలకు రావాలని ప్రధానిని కోరగా అంగీకరించారని.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించే కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
అల్లూరి మ్యూజియానికి సీఎం జగన్ 22 ఎకరాలు కేటాయించారని మంత్రి ఆర్.కె.రోజా చెప్పారు. జిల్లాకు ఆయన పేరును పెట్టారని.. గిరిజనుల కోసం పాడేరులో వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులకు, కొందరు గిరిజనులకు సన్మానాలు చేశారు. తొలుత బీచ్‌రోడ్డు, సీతమ్మధారల్లోని అల్లూరి విగ్రహాలకు కిషన్‌రెడ్డి, పలువురు నేతలు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పి.వి.ఎన్.మాధవ్, ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి ఆశయ సాధనకు సీఎం కృషి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం మంప, రాజేంద్రపాలెంలో అల్లూరి వర్ధంతిని శనివారం నిర్వహించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాజేంద్రపాలెం అల్లూరి స్మారక ఉద్యానవనంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటన్నదొర, గాం మల్లుదొర, బోనంగి పండుపడాల్ విగ్రహాలను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కుంభా రవిబాబు, అరకు ఎంపీ మాధవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంపలో ఏర్పాటు చేసిన 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాం మల్లుదొర మనవడు గాం బోడిదొరను సన్మానించారు.
ఇదీ చదవండి:
Central team to visit kopparthy: రాష్ట్రంలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటునకు కేంద్ర బృందం పరిశీలన