Central Minister Jai Shankar: ఐక్యరాజ్య సమితి విఫలం అవ్వడంతోనే మధ్యలో జీ7, జీ20 గ్రూపులు పుట్టుకొచ్చాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. చైనా దేశం సరిహద్దు చట్టాలు, ఒప్పందాలను మీరిందన్నారు. అయినప్పటికీ వాణిజ్య వ్యవహారాల మధ్య ఎక్కడా ఇబ్బంది రాకుండా చూశామన్నారు. ఆదివారం రాత్రి విశాఖలో ‘భారత ఎనిమిదేళ్ల విదేశాంగ విధానం’పై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో వేల మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. వారిని తీసుకువచ్చేందుకు మన దేశం చేసినట్లు ఏ దేశం ప్రయత్నించలేదు. 19 విమానాల్లో 25 వేల మంది విద్యార్థులను తీసుకొచ్చాం. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మన దేశ తీరును ప్రశంసించాయి.
కొవిడ్ సమయంలో వందేభారత్ మిషన్‌లో 17 లక్షల మందిని మన దేశానికి తీసుకొచ్చామన్నారు. ప్రపంచానికి ప్రస్తుతం మన దేశం ఒక ఫార్మసీ హబ్‌గా మారింది. కొవిడ్ సమయంలో మన దేశం నుంచి వేల టీకాలు ఇతరులకు అందించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమం పేదల కోసమేనని, గతంలో వంద రూపాయల్లో పది రూపాయలు లబ్ధిదారుడికి అందేదని, ఇపుడు వందకు వంద అందుతోందన్నారు.
890 మంది మిలియన్ ప్రజలకు గరీబ్ కల్యాణ్ యోజనతో లబ్ధి చేకూరుతోందన్నారు. ఇతర మరెన్నో పథకాలతో మన దేశ ఆర్థిక, సామాజిక ప్రగతి మారిందన్నారు. ప్రజలకు వీలుగా పాస్‌పోర్టు సేవలను పోస్టాఫీసుల్లోనూ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ జీవీఎల్ నరసింహరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: