విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని అడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో గురువారం జరిగిన ప్రమాదం కలకలం రేపింది. ట్యాంకు వాల్వు నుంచి క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ లీకై పెద్ద ఎత్తున విష వాయువు పొగలు (ఫ్యూమ్స్) వెలువడ్డాయి. కంపెనీకి సమీపంలో ఉన్న తాడి గ్రామాన్ని పొగలు కమ్మేసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు కళ్లు, ముఖం, ముక్కుమంటతోపాటు శ్వాస ఆడక ఇబ్బందిపడ్డారు. ఆగ్రహించిన గ్రామస్థులు కంపెనీ ఎదుట నిరసనకు దిగారు. ఆర్డీవో కిషోర్, పోలీసులు తెలిపిన వివరాలివి.
ప్రమాదం జరిగిన కంపెనీలో బల్క్‌డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కంపెనీ సాల్వెంట్ యార్డుకు సమీపంలో ఉన్న 20కేఎల్ సామర్థ్యమున్న ట్యాంకులో 5కేఎల్ క్లోరోసల్ఫోనిక్ యాసిడ్ ఉంది. ఉదయం 8.30 ప్రాంతంలో ట్యాంకుకు చెందిన లెవెల్ గ్లాస్ దెబ్బతిని వాల్వు ద్వారా సుమారు 50 లీటర్ల యాసిడ్ నేలపాలైంది. వెంటనే కంపెనీ ప్రతినిధులు లీకైన వాల్వుకు మరమ్మతు చేపట్టారు. నేలపాలైన యాసిడ్‌కు భూమిలోని తేమ తగిలి పెద్ద ఎత్తున పొగలు (ఫ్యూమ్స్) వెలువడ్డాయి. వీటిని పొడి ఇసుక వేసి నియంత్రించాల్సి ఉండగా కంపెనీ ప్రతినిధులు కంగారులో తడి ఇసుక చల్లారు. దీంతో పొగలు మరింతగా వ్యాపించాయి. చివరికి సోడియం బైకార్బొనేట్ పౌడర్‌తోపాటు పొడి ఇసుక చల్లడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పొగలు అదుపులోకి వచ్చాయి. యాసిడ్ ఉన్న ట్యాంకు మెరుగ్గా లేకపోవడంతోపాటు సరైన పర్యవేక్షణ లేనందున ఈ ప్రమాదం జరిగిందని పలువురు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఆర్డీవో కిషోర్, కాలుష్య నియంత్రణ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు.
తాడి గ్రామస్థుల నిరసన
విషవాయువులు కమ్మేయడంతో ఆందోళనకు గురైన తాడి గ్రామస్థులు కంపెనీ ఎదుట బైఠాయించారు. తమ ప్రాణాలతో చెలగాటమాడతారా? అంటూ కంపెనీ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన కె.నీలమ్మ, ఎ.ముత్యాలు, కె.ఆదినారాయణను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్సు పెట్టమని.. గ్రామంలో వెంటనే వైద్యశిబిరం నిర్వహించాలని కంపెనీ ప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు. చివరకు తామే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారు. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే కంపెనీ యాజమాన్యం బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఆర్డీవో కిషోర్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. గతేడాది విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరీన్ వాయువు లీకై పలువురు చనిపోయిన విషయం విధితమే.
యాజమాన్యం తీరుపై ఆర్డీవో ఆగ్రహం
ఘటన జరిగి 3గంటలు దాటినా పరిస్థితిని ఎందుకు అదుపులోకి తేలేకపోయారని ఆర్డీవో కిషోర్ ప్లాంట్ హెడ్ భాస్కర్‌ను నిలదీశారు. కనీసం పొడి ఇసుకను అందుబాటులో ఉంచుకోకుండా నిరక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. ‘నేనే వెళ్లి రెండు ట్రాక్టర్ల ఇసుక తెచ్చుకోవాలా? ఏదైనా పెద్ద ప్రమాదం జరిగితే చేతులెత్తేస్తారా? చిన్న ప్రమాదాన్ని సకాలంలో అరికట్టలేని సేఫ్టీ మేనేజర్ ఎందుకు?’ అని ఆగ్రహించారు. ఆందోళనతో తాడి గ్రామస్థులు కంపెనీ వద్దకు వచ్చినప్పుడు వారి సమస్యలు వినకుండా నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని, కంపెనీ యాజమాన్యంపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఆర్డీవో విలేకరులకు తెలిపారు.
ఇదీ చదవండీ.. గండేపల్లిలో దొంగల హల్‌చల్.. పలు ఆలయాల్లో చోరీ