Tourism Development in AP : పర్యాటకానికి రాష్ట్రం చిరునామాగా మారాలి అంటూ 2021 అక్టోబరు 27న రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం జగన్ ఘనంగా చెప్పారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు ఉండాలని అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలన్నారు. కానీ వాస్తవంలో మాత్రం రాష్ట్ర పర్యాటకరంగంలో పెట్టుబడులు ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
2వేల868 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన వివిధ ప్రాజెక్టులను రాష్ట్ర పెట్టుబడులు, ప్రోత్సాహక మండలి రెండేళ్ల క్రితం ఆమోదించింది. వీటి ద్వారా 48 వేల మందికి ఉపాధి లభిస్తుందని అప్పట్లో గొప్పగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రాజెక్టుల్లో నాలుగు హోటళ్లు ప్రారంభమైతే మూడు ఒబెరాయ్ హోటళ్లకు ఈ ఏడాది జులైలో సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి. ప్రారంభమైన హోటళ్లలోనూ కొన్నింటికి గత ప్రభుత్వ హయాంలోనే రాయితీలు మంజూరు చేశారు. మిగిలిన ప్రాజెక్టులు ఒప్పందాలకే పరిమితమయ్యాయి. మొదట ముందుకొచ్చిన సంస్థలు కూడా ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి.
పడి లేవని పర్యాటకం, కాగితాలకే పరిమితమవుతున్న ప్రణాళికలు
Construction of Skytower on Kailasagiri in Visakha with Rs.100 Crores : విశాఖ నగరంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనతో పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఉత్తుత్తివేనని స్పష్టమవుతోంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం- PPP విధానంలో పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ముందుకొచ్చిన సంస్థలేవీ ఇంకా పనులే మొదలు పెట్టలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన అమ్యూజ్మెంట్ రైడ్స్ సంస్థ ఇంటమిన్ 100 కోట్ల రూపాయలతో విశాఖలోని కైలాసగిరిపై స్కైటవర్ నిర్మాణానికి ముందుకొచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కానీ ఇందుకు సంబంధించిన పనుల జాడలేవీ కానరావడంలేదు. టర్కీకి చెందిన పోలిన్ గ్రూపు తొట్లకొండ బీచ్‌లో 100 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయాల్సిన టన్నెల్ అక్వేరియం విషయంలోనూ పురోగతి లేదు. అరకులోయలో టెథర్డ్ గ్యాస్ బెలూన్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఫ్రాన్స్క చెందిన ఏరో ఫైల్ సంస్థ ఆసక్తిగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించినా ఆచరణకు నోచుకోలేదు.
Minister Avanthi: సీమ జిల్లాల్లో పర్యటక రంగ అభివృద్ధికి చర్యలు: మంత్రి అవంతి
YSRCP Government Not Fund the Development of Hotels and Resorts : పర్యాటక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టకపోగా కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులను సైతం అందిపుచ్చుకోవడం లేదు. విజయవాడ, శ్రీశైలంలో కృష్ణా నదిపై రెండు రోప్ వే ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ రహదారుల సరకు రవాణా యాజమాన్య సంస్థ ముందుకొచ్చింది. పర్వతమాల ప్రాజెక్టులో భాగంగా రెండు రోప్‌వేల నిర్మాణానికి అయ్యే నిధులను కేంద్రమే సమకూర్చనుంది. ఈ మేరకు మొదట NHLMLతో ఒప్పందం చేసుకున్న ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ తరువాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఏమిటనేది అధికారులు బయటకు చెప్పడం లేదు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రోప్‌వేల నిర్మాణం ప్రారంభించలేదు.
విజయవాడలోని భవానీ ద్వీపంలో PPP విధానంలో 5 కోట్ల రూపాయలతో వెయ్యి సీట్ల సామర్థ్యం గల కన్వెన్షన్ సెంటర్, 2.50 కోట్ల రూపాయలతో ఎలివేటెడ్ టాయ్ ట్రైన్, 2 కోట్లతో జంగిల్ ఎకో రిసార్టులు ఏర్పాటు సైతం ప్రతిపాదనలకే పరిమితమైంది. సత్యసాయి జిల్లా పెనుకొండలో 200 కోట్లతో PPP విధానంలో మెగా స్పిరిచ్యువల్, హెరిటేజ్ టూరిజం సెంటర్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపినా పనులు ప్రారంభం కాలేదు. ప్రధాన నగరాలు, ప్రసిద్ధ ప్రాంతాల్లో పర్యాటకుల కోసం కారవాన్లు ఏర్పాటు చేయాలని ఏడాదిన్నర క్రితం ప్రణాళిక రూపొందించారు. ఈ కారవాన్ పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులో మొత్తం ఐదు యూనిట్లను ప్రతిపాదించగా ఒకటి కూడా ఏర్పాటు కాలేదు.