Visakha Steel Plant workers agitation : సెయిల్ తరహాలో వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలని కోరుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు ఆందోళనకు దిగారు. స్టీల్‌ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించి వాహనాల రాకపోకల్ని అడ్డుకున్నారు. కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట కారణంగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులు... నూతన వేతన విధానం, ఉద్యోగ నియామకాల కోసం పోరుబాట పట్టారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనలతో స్టీల్‌ప్లాంట్ పరిపాలనా భవనం పరిసరాలు అట్టుడికాయి. సెయిల్ తరహాలో వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలంటూ... పరిపాలన భవనాన్ని కార్మికులు, ప్రజా సంఘాల నేతలు ముట్టడించారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలపడంతో.. కార్మికుల్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.
వేతన ఒప్పంద సవరణ అమలు చేయాలి.. సెయిల్‌లో అమలు చేస్తున్న నూతన వేతన ఒప్పంద సవరణలను స్టీల్‌ప్లాంట్ సిబ్బందికి వర్తింప చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసికంగా, ఆర్థికంగా కార్మికుల్ని దెబ్బతీసి.. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల నిరసనతో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం దిగొచ్చింది. ఆర్ఐఎన్ఎల్ చీఫ్ జీఎం సంజీవరావు కార్మిక నేతలతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నెలాఖరులోగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో స్టీల్‌ప్లాంట్ కార్మికులు ఆందోళన విరమించారు.
'రాష్ట్రంలో ఉన్న ఏకైక కర్మాగారం ఇది. దీనిని కాపాడుకోక పోతే ఎలా..? సంవత్సరానికి 9వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్న కంపెనీ ఇది. దేశంలో ఏ అంబానీ, అదానీ అంత టాక్స్ కడుతున్నారు. అయినా ఎందుకు అమ్మాలని ప్రయత్నిస్తున్నారో సమాధానం చెప్పాలి. విశాఖపట్నం అభివృద్ధి అంటున్న పాలకులు స్టీల్ ప్లాంట్ లేని అభివృద్ధిని చూపించగలరా..? మెట్రో ట్రెయిన్ లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. ఉత్తరాంధ్రకు నిధులు ఇవ్వడం లేదు. అవేమీ లేకుండా ఏకైక స్టీల్ ప్లాంట్‌ని కూడా అమ్మేస్తే ఈ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమిటి..? స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్.. కార్మికుల సమస్యలు, పరిశ్రమ మనుగడను గాలికొదిలేసింది. ఆర్థిక ప్రయోజనాలు అనుభవిస్తున్న అధికారులు.. పరిశ్రమను మూతవేసే పరిస్థితులు కల్పిస్తున్నారు. తక్షణమే వేతన సవరణ చేయాలి' అని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. సానుకూల ఫలితం రాకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి :