విశాఖ జిల్లాలోని సీలేరు కాంప్లెక్స్‌లో జల విద్యుత్కేంద్రాలు లక్ష్యసాధన దిశగా విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. సీలేరు కాంప్లెక్స్‌లోని సీలేరు జల విద్యుత్ కేంద్రం లక్ష్యాన్ని గడువు కంటే మూడున్నర నెలలు ముందుగానే సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రం కూడా లక్ష్యాన్ని మూడు నెలలు ముందుగానే ఛేదించింది. మరో రెండు జలవిద్యుత్ కేంద్రాలు కూడా లక్ష్యాన్ని చేరుకోవడానికి పరుగులు తీస్తున్నాయి. ప్రతీ ఏటా లక్ష్యాన్ని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ.... ఏపీ జెన్‌కోకు విధిస్తుంది. ఆర్థిక సంవత్సరంలోపు లక్ష్యాన్ని సాధించాలి. ఇందులో భాగంగా 2019-20 ఆర్థికసంవత్సరానికి సీలేరుకు 418 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం విధించగా.... గత డిసెంబర్ 11 అర్ధరాత్రి దీనిని సాధించింది.
ఇక మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రానికి 500 మిలియన్ యూనిట్లు లక్ష్యం ఇవ్వగా... ఈ నెల మొదటి వారంలోనే ఛేదించింది. డొంకరాయి పవర్‌కెనాల్‌కు గండి పడటంతో డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రంలో సుమారు రెండు నెలలు పాటు విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీనివల్ల లక్ష్య చేధనలో ఈ రెండు కేంద్రాలు వెనుకబడ్డాయి. గతేడాది లక్ష్యాన్ని అన్ని జలవిద్యుత్ కేంద్రాలు మార్చి నాటికి సాధించాయి. ఈ ఏడాది మూడు నెలలు ముందుగానే రెండు జలవిద్యుత్ కేంద్రాలు సాధించడం విశేషం. ప్రస్తుతం సీలేరు కాంప్లెక్స్‌లో నాలుగు జలవిద్యుత్కేంద్రాల పరిధిలో రోజుకు సుమారు అయిదు నుంచి ఆరు మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి:సీబీఐ జేడీని మార్చండి.. ప్రధానికి విజయసాయిరెడ్డి లేఖ