విశాఖ జిల్లా నర్సీపట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఇప్పుడు కొత్తగా తయారుకాబోతుంది. నర్సీపట్నం సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నారపరెడ్డి మౌర్య చొరవతో... ఈ భవనానికి మరమ్మతులు చేస్తున్నారు. సుమారు 11 లక్షల రూపాయలతో దీన్ని ఆధునీకరణకు శ్రీకారం చుట్టారు. ఆంగ్లేయుల పాలనలో ఊరికి దూరంగా విశాలమైన స్థలంలో నిర్మించారు. దశాబ్దాల తరబడి అప్పుడప్పుడు స్వల్ప మరమ్మతులు మినహా శాశ్వత ప్రాతిపదికపై దీని పరిరక్షణకు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఈ భవనం వెనుక భాగం శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల కొత్తగా నియమితులైన సబ్ కలెక్టర్ మౌర్య ప్రస్తుతం వేరేచోట అద్దె భవనంలో ఉంటున్నారు. భవనం దుస్థితి గురించి ఆమె జిల్లా కలెక్టర్కు వివరించి బంగ్లా రూపురేఖల్లో అవసరమైన మార్పులు చేస్తున్నారు.
చారిత్రక కట్టడం కావడంతో దీని నిర్మాణ ఆకృతిలో మార్పు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ గృహనిర్మాణ సంస్థ ఇంజనీర్ల పర్యవేక్షణలో భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికితోడు రక్షణకు ప్రాధాన్యతనిస్తూ భవనం ప్రవేశ మార్గంలో ప్రత్యేకంగా గార్డు రూం కూడా నిర్మిస్తున్నారు. రోడ్డు పక్కన ఆక్రమణలకు అవకాశం లేకుండా ప్రహరీ కడుతున్నారు. ఈ బంగ్లాకు ఎంతో ప్రాధాన్యత ఉందని ఇది నాలుగు కాలాలు నిలిచి ఉండాలని దీని పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అనుమతితో దీనిలో అన్ని పనులు చేపడుతున్నామన్నారు.
ఇదీ చూడండి.
'ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా.. రైతులకు న్యాయం జరిగేలా చూస్తా'