తెలుగు భాషకు నష్టం కలిగించే వారు ఎంతటి నాయకులైనా... వారి రాజకీయ భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోతుందని తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీలో సంస్కృత అకాడమీని కలిపి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా... తెలుగు దండు ఆధ్వర్యంలో విశాఖ మద్దిలపాలెం కూడలిలో తెలుగుతల్లి విగ్రహం వద్ద 'నిరసన గళం' పేరిట నిరసన చేపట్టారు.
"సంస్కృత అకాడమీ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు. సంస్కృతం, తెలుగు భాషకు గురుస్థానంలో ఉంటుంది. అయితే ఈ రెండు అకాడమీలు కలిపి ఏర్పాటు చేయడం వల్ల ప్రణాళికలు, నిధుల సాధన కలగూరగంపగా మారే ప్రమాదం ఉంది" అని పరవస్తు ఫణిశయన సూరి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు అకాడమీ, తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు.. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సలహాలు అందించాలని సూచించారు.
ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్.. అకాడమీల విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేనిపక్షమలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమం చేస్తామని ఫణిశయన సూరి స్పష్టం చేశారు. భావితరాలకు మాతృభాషను భద్రంగా అందించాలని.. ఈ సందర్భంగా తెలుగు దండు కార్యకర్తలు, సాహితీవేత్తలు ప్రతిజ్ఞ చేశారు. మాతృభాష తెలుగును ప్రాథమిక విద్యలో బోధనా భాషగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: