TDP Leaders Protest in AP: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. రాష్ట్రబంద్‌కు టీడీపీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు ఎక్కడికక్కడ రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, పలు కూడళ్లలో ఆందోళనకు దిగారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లకు తరలిస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
TDP Leaders Agitation Against Chandrababu Arrest: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నియోజకవర్గ ఇంఛార్జి చదలవాడ అరవిందబాబు, పార్టీనాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. నిరసనలకు, ర్యాలీలకు అనుమతి లేదంటూ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, గిద్దలూరులో డిపో వద్ద ఆర్టీసీ సర్వీసులను నిలిపివేయాలని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. తెలుగుదేశం కార్యకర్తలను కనిపించిన చోటే పోలీసులు అదుపులో తీసుకుని వాహనాలు ఎక్కించి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు.
TDP Calls for State Bandh: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వేకువ జామునే పట్టణ సీఐ రమేశ్ బాబు తన సిబ్బందితో అఖిల ప్రియ నివాసానికి వెళ్లి నిర్బంధంలోకి తీసుకున్నారు. ఆమె బయటికి రాకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్దకు పోలీసులు పెద్దసంఖ్యలో చేరుకుని పహారా కాశారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని గృహ గృహనిర్బంధం చేశారు.
TDP Leaders Agitation: విశాఖలోని గాజువాక జంక్షన్ నుంచి ర్యాలీ చేస్తున్న టీడీపీ శ్రేణులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కొత్త గాజువాక వద్ద మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శెట్టిబత్తుల రాజబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అప్రజాస్వామికమని రాజబాబు అన్నారు.
TDP Leaders Protest Over Remand for CBN: సత్యసాయి జిల్లా పెనుకొండలో జాతీయ రహదారిపై ఆందోళన చేస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు బికే పార్థసారథిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పార్థసారథి అరెస్టును పార్టీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మార్పీఎస్ తెలుగు మహిళలు ఆర్టీసీ బస్సులకు అడ్డుపడి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకంఠం కూడలిలో బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఇవాళ టీడీపీ, జనసేన బందుకు పిలుపునివ్వడంతో పోలీసులు నాయకులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. తమ నాయకుడిని అక్రమంగా అరెస్టు చేస్తే నిరసన తెలిపే అవకాశం లేకుండా పోలీసులు వ్యవహరించడం సరికాదని తెదేపా నేతలు మండిపడ్డారు.