TDP LEADERS ON GEETAM : రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే గీతం వర్శిటీ భూములపై రాద్దాంతం చేస్తున్నారని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. విశాఖలోని ఆస్తుల కబ్జాలో భాగంగానే నేడు గీతంపై మరోసారి పడ్డారని ఆరోపించారు. నిజంగా ఆక్రమణలుంటే నోటీసులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాజధాని పేరుతో ప్రశాంత విశాఖను ఫ్యాక్షన్ కేంద్రంగా మార్చారన్నారు. భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్మెంట్లకు కేంద్రంగా తయారు చేశారని విమర్శించారు. జీవో నంబర్ ఒకటిపై వస్తున్న వ్యతిరేకతను దృష్టి మరల్చడానికే.. గీతం వర్శిటీపై పడ్డారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.
కొరడా రాజబాబును అడ్డుకున్న పోలీసులు: కోర్టులో విచారణలో ఉన్న విశాఖ గీతం వర్శిటీ మైదాన వివాదాన్ని కక్షపూరితంగానే వైసీపీ ప్రభుత్వం మళ్లీ వెలుగులోకి తెచ్చిందని.. టీడీపీ నేత కొరాడ రాజబాబు మండిపడ్డారు. గీతం ఛైర్మన్ భరత్‌ను కలిసేందుకు వెళ్తున్న తనని పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దీంతో రాజబాబు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. గీతంకు వెళ్లే మార్గంలో రోడ్డుపై బైఠాయించి టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను పోలీసులు గృహనిర్బంధించారు. గీతం వైద్య కళాశాలకు వెళ్తారని వెలగపూడిని అడ్డుకున్నారు.
ఇవీ చదవండి: