Chandrababu in Idem Karma Program at Pendurthi: రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. చినముషిడివాడ నుంచి పెందుర్తి కూడలి వరకూ రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వ నాశనం చేశారని మండిపడ్డారు.
"రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి. ఉద్యోగాలు, కంపెనీలు రావాలన్నా.. తెలుగు నేలకు గుర్తింపు తీసుకురావాలన్నా టీడీపీ గెలుపొందాలి. నాకు ఆ నమ్మకం ఉంది. సీఎం మోసాలు, అక్రమాలను ప్రజలు అడ్డుకోవాలి. అందుకు రానున్న ఎన్నికలు ఎంతో కీలకం. విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడతానని నాడు కౌరవ సభలో చెప్పా. త్వరలో అదే జరగబోతుంది. వైసీపీ నుంచి బెదిరింపులు ఎదురైనా, డబ్బులు పంచినా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించారు. జగన్ పని, వైసీపీ పని అయిపోయింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరూ గెలవలేరు. ఈ సీఎంకు సవాలు విసురుతున్నా.. పులివెందులలో గెలిచి చూసుకో. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా సైకో పోవడం ఖాయం. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు ప్రజాబలం ఉంది. ప్రజాబలం ముందు ధనబలం పనిచేయదు"-టీడీపీ అధినేత చంద్రబాబు
అమరావతిలో తానుంటున్న అద్దె ఇంటిని కూల్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని.. చంద్రబాబు మండిపడ్డారు. దోపిడీ సొమ్ముతో ఎన్నో ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్‌కు కూల్చడం తప్ప మరేమీ తెలియదని ఎద్దేవా చేశారు. అమరావతిలో.. పేదలకు ఇళ్ల పేరుతో మళ్లీ వంచనకు తెరలేపారని ధ్వజమెత్తారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు కట్టించిందని గుర్తు చేశారు. పూర్తైన ఇళ్లు లబ్దిదారులకు అప్పగించకుండా.. నాటకాలు అడుతున్నారని మండిపడ్డారు.
"అమరావతిలో నేను ఉన్న ఇల్లు అద్దెది. సొంతది కాదు. సీఎం జగన్‌కు హైదరాబాద్‌లో ఒక ప్యాలెస్, బెంగళూరు, చెన్నై, కడప, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలో ప్యాలెస్‌లు ఉన్నాయి. నేను అద్దె ఇంట్లో ఉంటే దాన్నీ కూల్చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఇంటికి అద్దె చెల్లిస్తుంటే క్విడ్ ప్రోకో కింద ఇచ్చారంటున్నారు. ఇపుడు నేను ఉన్న ఆ ఇంటిని జప్తు చేస్తామంటున్నారు"-టీడీపీ అధినేత చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందులలో కూడా గెలవరని చంద్రబాబు అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. చిత్తుచిత్తుగా ఓడిపోతారని చెప్పారు. సొంత బాబాయిని గొడ్డలితో నరికేసి గుండె పోటుగా చిత్రీకరించిన సీఎంకు.. ప్రజలంటే ప్రేమ ఎందుకుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు.
ఇవీ చదవండి: