YSRCP leaders on Amaravati comments: టీడీపీ నాయకులు మళ్లీ ఒకే రాజధాని అని, అమరావతి కోసం నిధులు వెచ్చిస్తామంటే.. మేం ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాల్సిందేనని పట్టుబడతామని రెవెన్యూ శాఖా మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల జరిగిన సభలో శ్రీశ్రీ, వంగపండు, గిడుగు రామ్మూర్తి పంతులు, చాగంటి సోమయాజులు తదితర మహానుభావుల పేర్లు ప్రస్తావించారు.. కానీ వారి భావజాలాన్ని ఒంట పట్టించుకున్న విధంగా మాట్లాడటం లేదని ఆగ్రహించారు. 65 సంవత్సరాలపాటు ఓ ప్రాంత ప్రజల నోరునొక్కి, ప్రభుత్వ ధనాన్ని ఓ ప్రాంతానికి కేటాయించి అభివృద్ధి చేస్తే... హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో రావాల్సి వచ్చింది అని విమర్శించారు.
అనంతరం అమరావతిలో టీడీపీ వాళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని చెబుతున్నారని, తాను మాత్రం పరిపాలనా వికేంద్రీకరణ కావాలంటున్నానని పేర్కొన్నారు. మూడు రాజధానులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. పాలనా రాజధానిగా విశాఖను చేయాలని నిర్ణయించిందన్నారు. కానీ చంద్రబాబు రాజాం వచ్చి ఒకటే రాజధాని కావాలంటున్నారని, ఇలాగైతే మళ్లీ ఓ 50 ఏళ్లు వెనక్కి పోవాల్సి వస్తుందన్నారు.
''మీరు ఎవరితో కలిసి ప్రయాణించాలనుకుంటున్నారు. ఎవరివైపు నిలిచి ప్రశ్నిస్తున్నారు? చంద్రబాబుపై మీకున్న అభిప్రాయం చెప్పండి. విశాఖలో భూమి కబ్జా చేశానని అంటున్నారు. ఇది నిజం కాదు. ఏ సైనికుడి భూమినైనా కబ్జా చేశానని చెప్పగలరా? ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలను అభినందించలేరా? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విశాఖలో భూములు తాకట్టు పెట్టి ఏం చేశారు. ఎక్కడికైనా పట్టుకుపోయారా.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దని కేంద్ర పెద్దలను కలిసి విన్నవించాం'' అని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రానికి, సమాజానికి పట్టిన చీడపురుగు పవన్ కల్యాణ్. ఆయనకు ఎప్పటికీ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి ఉండదని’ ధ్వజమెత్తారు. తెలుగు రాజకీయాల్లో పవన్ ఒక కామెడీ పీస్ అని ఎద్దేవా చేశారు. ఆయన వచ్చి రాజకీయాల్లో సవాళ్లు విసరడం, జనాల్ని పోగు చేసి రెచ్చగొట్టడంపై తాము స్పందించాల్సి రావడం దౌర్భాగ్యమన్నారు. యువశక్తి సాక్షిగా ఒంటరిగా పోటీ చేసే శక్తి తనకు లేదని.. చంద్రబాబు తోడుగా వస్తేనే పోటీ చేస్తానని పవన్ స్పష్టం చేశారని గుర్తు చేశారు. ''పవన్ కల్యాణ్..చంద్రబాబుతో కలసి వచ్చినా, ఒంటరిగా పోటీ చేసినా జరిగేది రాజకీయ మరణమే. జనసేనతో బీజేపీ కలిసి ప్రయాణం చేస్తుందా? అసలు బీజేపీ ఎక్కడుందో పవన్ చెప్పాలి'' అని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
విశాఖ గవర్నర్ బంగళాలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ పేరును చంద్రసేనగా మార్చుకుంటే చాలా మేలని మంత్రి విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్‌గా మారిపోయారని, ఆయనకు దమ్ముంటే సింహాద్రి అప్పన్న స్వామి సమక్షంలో చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకోలేదని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ప్రజల గుండెల్లో జగన్ ఖైదీగా నిలిచారని, ఎవరెన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని పార్టీలు కలిసి ఒక్కటైనా విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి అమర్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు వేదికపై ఎలా మాట్లాడాలో ఒక రాజకీయ నాయకుడిగా నేర్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు సూచించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆయన మాటలు సినీ డైలాగుల్లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగాలన్నీ రాజకీయ ప్రసంగంలా లేవని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేసే బలం లేదన్న వాస్తవాన్ని పవన్ స్వయంగా ఒప్పుకున్నారని వ్యాఖ్యానించారు.
ఇక, చివరగా శాసనసభ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి మీడియాతో మాట్లాడుతూ..'ముఖ్యమంత్రి కావాలని ఆశ పడుతున్న వ్యక్తి.. ఆ హుందాతనాన్ని మరిచి తన్నండి, కొట్టండి అని ప్రజలను ప్రోత్సహించడం ఎంత వరకు సమంజసం?. ఇది పరోక్షంగా అరాచకం సృష్టించడమే’ అని విమర్శించారు. సినిమా డైలాగులతో రాజకీయం చేస్తే కుదరదని హెచ్చరించారు. ఒంటరిగా పోటీ చేస్తే దిక్కు లేకే.. టీడీపీతో వెళ్తే గెలుస్తానేమో అన్న ఆలోచన మీదని, మీరు కలిసినంత మాత్రాన వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి