Sugarcane Cultivation Reduced Under YCP Govt: ఎన్నికల ప్రచార సభలో చెరకు రైతుల నోట్లో పంచదార పోసినంత తియ్యగా జగన్ మాటలు చెప్పారు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఎన్నెన్నో జిమ్మిక్కులు చేసిన జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక చెరకు రైతులను కూడా నిండా ముంచేశారు. అధికారంలోకి వచ్చాక నాలుగు సహకార చక్కెర కర్మాగారాలను మూసేశారు. జగన్ సర్కారు మొండిచేయి చూపించడంతో ఈ నాలుగేళ్ల కాలంలో దాదాపు 90 వేల ఎకరాల్లో చెరకు సాగును రైతులు విరమించుకోవాల్సి వచ్చింది. ఇదంతా మాట తప్పి, మడమ తిప్పేసిన జగన్ నిర్వాకాల ఫలితమే. నాడు జగన్ మాటలు నమ్మి ఓట్లేసి నిండా మునిగిపోయినవారిలో చెరకు రైతులు కూడా ఉన్నారు. బతుకు తెరువు కోసం వలస బాటలో ఎక్కడెక్కడికో తరలి వెళ్లిపోతున్న కుటుంబాల దుస్థితిని చూస్తున్నా.. వైసీపీ సర్కారులో చలనమే లేదు. టీడీపీ హయాంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయిదు సహకార చక్కెర కర్మాగారాలు పని చేయగా.. ఇపుడు ఒక్కటే నడుస్తోంది. అదీ తీవ్ర ఒడుదొడుకుల మధ్య.
Factories Closed After YCP Came to Power.. వ్యవసాయాన్ని పండగ చేస్తానంటూ నాడు మాయమాటలు చెప్పిన జగన్.. గద్దెనెక్కాక వ్యవసాయాధారిత కర్మాగారాలను ఒక్కొక్కటిగా మూసేస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు.
- 2019-20లో అనకాపల్లిలోని తుమ్మపాల కర్మాగారాన్ని మూసేసి ఏకంగా దాని ఆస్తులను అమ్మేందుకు యత్నిస్తున్నారు.
- 2020-21లో విజయనగరం జిల్లాలోని బీమసింగి కర్మాగారాన్ని మూసేశారు.
- 2021-22లో అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక, తాండవ కార్మాగారాలను మూసేశారు.
నాలుగేళ్ల క్రితం వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చటి చెరకు తోటలు కనువిందు చేసేవి. వైసీపీ సర్కారు వచ్చాక పరిస్థితి తల్లకిందులైపోయింది. కర్మాగారాలు మూతపడడంతో చెరకు సాగు అంటేనే రైతులు హడలిపోతున్నారు. పోనీ బెల్లమైనా తయారు చేద్దామంటే వాటి ధరలు గిట్టుబాటు కావటం లేదు. నల్లబెల్లం తయారు చేస్తున్నారంటూ పోలీసుల దాడులు రైతులను మరింతగా కుంగదీస్తున్నాయి. అందరికీ తీపిని పంచి.. చివరకు చేదు ఫలితాలను అనుభవిస్తున్నారు. చేసేదిలేక చెరకు సాగును విడిచిపెట్టేస్తున్నారు. 2019 నాటికి ఉత్తరాంధ్రలో 1.20 లక్షల ఎకరాల్లో సాగవ్వగా... 2023కు వచ్చేసరికి ఇది 30 వేల ఎకరాలకు పడిపోవటం బాధాకరం.
జగన్ నిర్వాకం కారణంగా గత నాలుగేళ్లలో 90 వేల ఎకరాల్లో చెరకు సాగు తగ్గిపోయింది. ప్రత్యామ్నాయ పంటలు సైతం గిట్టుబాటు కాకపోవటంతో బతుకుతెరువు కోసం చెరకు రైతులు ఎక్కడెక్కడికో తరలి వెళ్లాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారం అనకాపల్లి జిల్లాలోని గోవాడ ఒక్కటే. ఇక్కడ కూడా ఏటా గానుగాటను తగ్గించుకుంటూ వస్తున్నారు. 2018లో 4.5 లక్షల టన్నులు క్రషింగ్ చేస్తే గతేడాది 2.21 లక్షల టన్నులకే పరిమితమైంది. దీని పరిధిలోని చెరకునే పూర్తిస్థాయిలో తీసుకోలేకపోతున్నారు. ఇక మిగిలిన ప్రాంతాలలో పండిన చెరకు పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్ధకంగా మారింది. పంట సరఫరా చేసిన రైతులకు దాదాపు ఆరు నుంచి ఎనిమిది నెలలుగా పూర్తి స్థాయిలో డబ్బులివ్వలేదు.
Pulses Cultivation Reduced in AP: నీటిమీద రాతలుగానే జగన్ హామీలు.. ‘చిరు’సాయమూ కరవే!
గోవాడ పరిధిలో రైతులు, సిబ్బందికి కలిపి 12 కోట్ల రూపాయల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి చెరకు సరఫరా చేసిన 15 రోజుల్లోనే రైతులకు డబ్బు చెల్లించాలి. లేకుంటే 14 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలి. సకాలంలో డబ్బులందకపోవడంతో సాగు కోసం చేసిన అప్పులపై వడ్డీలు పెరిగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ఏటికొప్పాక, తాండవ కర్మాగారాల్లో సిబ్బందికి 22 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. రైతులు ఆందోళనలు చేసినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఇటీవల గోవాడ మహాజనసభలో బకాయిలపై రైతులు ప్రశ్నించగా ఎమ్మెల్యే ధర్మశ్రీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల వేళ బకాయిలు చెల్లించకుంటే ఇబ్బందులొస్తాయని చెప్పడంతో ఆ మొత్తాన్ని గ్రాంట్ రూపంలో ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతించినట్లు తెలిసింది.