విజయవాడలో తెల్లవారుజాము నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. నగరవాసులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచే వాతావరణమంతా మబ్బులు కమ్ముకుని ఉండగా కాసేపటికే ఈదురుగాలులతో కూడిన వర్షం తోడైంది. ముందుజాగ్రత్తగా పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు.
విశాఖలో భారీ వర్షం..
విశాఖ జిల్లా పాయకరావుపేటలో.. ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి కాలువల్లోకి వర్షం నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సింహాచలం సింహగిరిపై భారీ వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న భక్తులు వర్షం రావడంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. స్వామివారి ఆలయ మెట్ల మార్గంలో నీరు పారుతోంది.
తూర్పుగోదావరి జిల్లాలో ..
అమలాపురంలో సహా కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. రోడ్లన్నీ జలమయ్యాయి. పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడం పట్ల రైతులు హర్షం చేస్తున్నారు.
ముమ్మిడివరం, పి.గన్నవరం, అల్లవరం, అయినవిల్లి, ఉప్పలగుప్తం, అంబాజీపేట, మామిడికుదురు, రాజోలు తదితర మండలాల్లో కుండపోతగా కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి సామాన్యులు ఇబ్బంది పడ్డారు. వర్షం ఉద్యాన పంటలకు మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొత్తపేటలో ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో రైతు బజార్ సమీపంలో కూరగాయలు నీటిలో కొట్టుకుపోయాయి. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు భౌతిక దూరం పాటించడం కోసం మార్కట్ను పక్కనే ఉన్న సత్రంలో నిర్వహిస్తున్నారు. వర్షం కురిసిన ప్రతి సారి తీవ్రంగా నష్టపోతున్నామని తమ దుకాణాలను రైతు బజార్లో ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు.. అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండి: గుమ్మడంత మామిడి.. ఎక్కడో తెలుసా!