రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని రాష్ట్ర షుగర్ కేన్ కమిషనర్ ఎల్.మురళి వెల్లడించారు. సాంకేతిక బృందం కర్మాగారాలను పరిశీలిస్తోందని చెప్పారు. ఈ బృందం తమ నివేదికను ప్రభుత్వానికి అందజేస్తోందని చెప్పారు. దీని ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని ఆయన సాంకేతిక బృందంతో కలిసి బుధవారం పరిశీలించారు. గోవాడ చక్కెర కర్మాగారానికి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. గానుగాటకు ముందే ఆధునికీకరణ చేపడతారన్నారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ విజ్ఞప్తి మేరకు ఈ కర్మాగారం ఆధునికీకరణకు ముఖ్యమంత్రి జగన్ రూ.10 కోట్లు విడుదల చేసిన విషయం విదితమే. ఈ నిధులతో చేపట్టే పనులపై దిల్లీకి చెందిన జాతీయ సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య సాంకేతిక నిపుణుడు మురళీధర్ చౌదరి నివేదికను తయారు చేశారు. ఈ నివేదికను కమిషనర్ మురళీకి అందజేశారు. కర్మాగారంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కార్మికులకు కల్పించాల్సిన పదోన్నతులు, పర్మినెంట్, దినవేతన కార్మికులు, వోచర్ పేమెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కమిషనరు మురళీకి గుర్తింపు యూనియన్ నాయకులు రామునాయుడు, సూరిబాబు వినతిపత్రం అందజేశారు. కార్మికుల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ కేన్ కమిషనర్ సత్యనారాయణ, గోవాడ, భీమసింగి కర్మాగారాల ఎండీలు సన్యాసినాయుడు, విక్టర్‌రాజు ఉన్నారు.
ఇవీ చదవండి