ఏవోబీలో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ముఖ్య నాయకుల లొంగుబాట్లు, అరెస్టులు, ఎదురుకాల్పులతో ఈ ప్రాంతంలో కొన్నాళ్లుగా ఆ పార్టీ చాలా క్యాడర్‌ను కోల్పోయింది. వీటికితోడు స్థానిక ఆదివాసీల నుంచి నియామకాలు లేకపోవటంతో మావోయిస్టులకు పట్టు తగ్గుతోంది. తాజాగా బుధవారం విశాఖపట్నం జిల్లాలో జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవటం, వారిలో ఇద్దరు డివిజనల్ కమిటీ సభ్యులు (డీసీఎం) స్థాయి నాయకులు ఉండటం ఆ పార్టీకి పెద్ద దెబ్బే. 2016 అక్టోబరు 23న ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎదురుకాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతిచెందారు.
తర్వాత కొన్నాళ్లకు ఆ పార్టీ ఛత్తీస్‌గఢ్ నుంచి 60-70 మంది క్యాడర్‌ను ఏవోబీలో దించింది. తర్వాత ఉనికి చాటేలా పలు ఘటనలకు పాల్పడింది. అరకు మాజీ ఎమ్మెల్యేలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హతమార్చింది. అయితే ఏవోబీ భౌగోళిక పరిస్థితిపై వీరికి పట్టు చిక్కకపోవటం, భాష అవరోధంగా మారటంతో అక్కడ పాగా వేయడం సాధ్యపడలేదు. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న కటాఫ్ ఏరియాలో ఒడిశా వైపు నుంచి నిర్బంధం పెరగటం, ఏపీ-ఒడిశా పోలీసుల సంయుక్త ఆపరేషన్లు అధికమవ్వటంతో ఆ ప్రభావం మావోయిస్టుల సంస్థాగత నిర్మాణాన్ని దెబ్బతీసింది.
సగానికి తగ్గిన ఏరియా కమిటీలు
* ఏవోబీలో గతంలో కలిమెల, నారాయణపట్నం, నందాపూర్, కాఫీదళం, గాలికొండ, పెదబయలు, గుమ్మా, బోయిపరిగూడ పేర్లతో మొత్తం 8 ఏరియా కమిటీలుండేవి. వాటిలో నాలుగే మిగిలాయి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) రెండు కంపెనీలుండేవి. ఇప్పుడు 10 మందితో కూడిన ఒక ప్లటూన్ మాత్రమే ఉంది.
* ఏవోబీలో గతంలో మొత్తం 160-180 మంది క్యాడర్ ఉండేది. ఇప్పుడు అందులో సగమే మిగిలిందనేది పోలీసుల మాట. గత రెండేళ్లలో ఏవోబీలో 8 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయి. వాటిలో 8మంది మావోయిస్టులు చనిపోయారు. వివిధ క్యాడర్లలోని ఆరుగురు అరెస్టయ్యారు. 31 మంది లొంగిపోయారు. మొత్తంగా ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు ఒకరు, నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు, 8 మంది ఏరియా కమిటీ సభ్యులు 8 మంది, 30 మంది దళం సభ్యులు పార్టీకి దూరమయ్యారు.
వరుసగా దెబ్బలు..
* ఏవోబీలో నాయకత్వ స్థానంలో కీలకంగా ఉంటూ ప్రత్యేక జోనల్‌కమిటీ సభ్యుడి స్థాయిలో ఉన్న ఎం.జలంధర్‌రెడ్డి ఇటీవల పోలీసులకు లొంగిపోయారు. అంతకుముందు మరో ముఖ్యనాయకుడు, డివిజనల్ కమిటీ సభ్యుడు అంజయ్య అలియాస్ నవీన్ లొంగిపోయారు.
* గాలికొండ దళంలో కీలక నాయకుడైన గెమ్మలి కామేష్ అలియాస్ హరి గతేడాది సెప్టెంబరులో పోలీసులకు పట్టుబడ్డారు. మిలీషియా కమాండర్‌గా ఉండే వంతల కామేశ్వరరావు, మరో కమాండర్ కొర్రా మల్లేశ్వరరావు అరెస్టయ్యారు.
* 2019 సెప్టెంబరు 22, 23 తేదీల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు, 2020 నవంబరులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందారు.
* ఏవోబీలో నాయకత్వానికి, క్షేత్రస్థాయిలో నిర్ణయాలు అమలుచేస్తున్న బాధ్యులకు మధ్య సమన్వయం కొరవడి అభిప్రాయ భేదాలు పెరిగాయి.
* అంతకుముందు కటాఫ్ ఏరియాలోని సురక్షిత స్థావరాల్లో తలదాచుకుని అవసరమైనప్పుడు ఏపీ వైపు వచ్చి కార్యకలాపాలు నిర్వహించి మళ్లీ వెనక్కి మళ్లిపోయేవారు. కటాఫ్ ఏరియాలో ఒడిశా ప్రభుత్వం భారీగా బలగాలను మోహరించడంతో అక్కడా వీరు పట్టు కోల్పోయారు.
ఒకే ప్రాంతంలో భేటీలే ముప్పును తెచ్చాయా?
కొన్నాళ్లుగా ఒకే ప్రాంతంలో వరుసగా భేటీలు కావటం... కదలికలన్నింటినీ అక్కడే కేంద్రీకృతం చేయటమే మావోయిస్టులను దెబ్బకొట్టిందా? విశాఖ మన్యంలోని తీగలమెట్ట వద్ద బుధవారం నాటి ఎదురుకాల్పుల ఘటనను విశ్లేషిస్తే అవుననే సమాధానం వస్తుంది. గత నెల 20న పాలసముద్రం సమీపంలో జరిగిన ఎదురుకాల్పుల నుంచి తప్పించుకున్న మావోయిస్టుల బృందమే తాజా ఘటనలో పోలీసు తూటాలకు చిక్కి బలైంది.
గత నెలలో ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశానికి, ప్రస్తుత ఘటనా స్థలమైన తీగలమెట్టకు మధ్య మూడు కిలోమీటర్లే దూరం. ఏవోబీలోని మిగతా ప్రాంతాల్లో భద్రతాబలగాల ఉనికి తీవ్రమవ్వటంతో విశాఖ-తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల వీరి కదలికలు పెరిగాయి. రెండు, మూడు నెలలుగా అక్కడే తరచూ సమావేశాలు నిర్వహిస్తూ సమీపంలోని స్థావరాల్లో తలదాచుకుంటున్నారు. ఈ సమాచారాన్ని అందుకున్న నిఘావర్గాలు అప్పటి నుంచే వారి ఉనికిపై కన్నేశాయి. మే 20న పాలసముద్రం సమీపంలో ఎదురుకాల్పులు జరగ్గా ప్రాణనష్టం లేకుండానే మావోయిస్టులు తప్పించుకోగలిగారు.
దాదాపు 30 మంది వరకూ తప్పించుకున్నారని గుర్తించిన పోలీసులు.. ఆ ప్రాంతంలో కూంబింగ్ పెంచారు. వారు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లటానికి వీల్లేకుండా అన్ని వైపుల నుంచి కట్టడి చేశారు. దీన్ని గుర్తించలేకపోయిన మావోయిస్టులు.. ఇటీవల మళ్లీ అక్కడే సమావేశాలు నిర్వహించటం మొదలుపెట్టారు. ఈసారి పక్కాగా ప్రణాళిక వేసిన భద్రతా బలగాలు గతంలోలా మావోయిస్టులు తప్పించుకోవడానికి వీల్లేకుండా ఆపరేషన్ చేపట్టి... ఆరుగుర్ని మట్టుబెట్టాయి. గాయపడిన ముఖ్యనేతల కోసం వెతుకుతున్నాయి.
ఇదీ చదవండి:
Vishaka Encounter: విశాఖ మన్యంలో ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు హతం!