ఒకటికాదు, రెండుకాదు.. ఏకంగా 46 పనులకు టెండర్లను నోటిఫికేషన్... కేవలం రెండు, మూడ్రోజుల ముందు జీవీఎంసీ అధికారులు పిలిచారు. ఇవన్నీ కూడా జనాలవాసాలకు మేలు చేసేవే. మొత్తం 7.6కోట్ల రూపాయల విలువైన పనులకు జీవీఎంసీ అప్పటికప్పుడు టెండర్లను జారీ చేసింది. ప్రస్తుతం ఈ విషయం జీవీఎంసీ కార్యాలయాల్లో చర్చనీయాంశంగా మారింది.
పనులెక్కడంటే..
టెండర్లన్నీ కూడా పాత వార్డుల సంఖ్య మీదే పిలిచారు. పెందుర్తి నియోజకవర్గంలో 70, 71, 72 పాతవార్డుల పరిధిలో ఉండే ప్రాంతాలకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. ఈ మూడువార్డులు కొత్తగా జరిగిన 98వార్డుల విభజనలో.. 93, 94, 95, 96, 97, 98 వార్డులుగా విడిపోయాయి. ఆయా ప్రాంతాల్లో ఈ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. మార్చి 10న జీవీఎంసీకి ఎన్నిక జరగనుంది. పనులన్నింటికీ మార్చి 1వ తేదీన టెండర్లు తెరిచి, వెనువెంటనే ఒప్పందాలు పూర్తిచేసుకుని పనులను ఆరంభించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈనెల 13న 71వ పాతవార్డుకు 4కోట్ల రూపాయలు విలువ చేసే పనులు, 72వ పాతవార్డుకు 1.61కోట్ల రూపాయలు విలువచేసే పనులకు టెండర్లు పిలిచారు. వీటికి ఒక్కరోజు ముందు.. అనగా ఈనెల 12న 70వ పాతవార్డుకు 2కోట్ల రూపాయలు విలువచేసే పనులకు టెండర్లు పిలిచారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇంత భారీగా.. ఒకేసారి టెండర్లను పిలవటంతో అనుమానాలకు దారి తీస్తోంది.
ఏమేం పనులంటే..
మునుపటి జీవీఎంసీ ఎన్నికల కంటే ముందు 2005లో పెందుర్తి చుట్టుపక్కలున్న గ్రామాల్ని నగరంలో విలీనం చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయిలో సౌకర్యాల్ని మెరుగుపరచలేదు. అప్పుడప్పుడూ మెరుపులాగా మాత్రమే పనులు జరిగేవనే విమర్శలున్నాయి. ఇప్పుడక్కడ.. సీసీరోడ్లు, కల్వర్టులు, బీటీరోడ్లు, కమ్యూనిటీ హాల్‌లకు మిగిలిన పనులు, వరదనీటి కాల్వలు... వచ్చేలా టెండర్ల సారాంశంగా ఉంది. అడవివరం, వేపగుంట, చినముషిడివాడ, పురుషోత్తపురం, లక్ష్మీపురం, చిమ్లాపల్లి, పులగవానిపాలెం తదితర ప్రాంతాల్లో వీటిని చేయనున్నారు. ఈ పనులపై జీవీఎంసీ అధికారులు నోరు మెదపడంలేదు.
ఇదీ చదవండీ..పార్కుల్లో మునుపటి సందడి... పెరుగుతున్న సందర్శకుల తాకిడి