ప్రశ్న : లాక్డౌన్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి ఇప్పటివరకు ప్రయాణికుల రవాణా ఏ రకంగా జరిగింది?
జవాబు: లాక్ డౌన్ -1 రిలీజ్ చేసిన దగ్గర నుంచి భారత ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారం సమ్మర్ షెడ్యూల్లో 1/3 ట్రాఫిక్‌ను ప్లాన్ చేశాం. ఎయిర్ ఇండియా, ఇండిగో, ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి. విశాఖ విమానాశ్రయం నుంచి ప్రతీ రోజు సగటున 9 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 1500 నుంచి 1600 మంది ప్రయాణిస్తున్నారు. తర్వాత వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా 45 శాతం సామర్ధ్యంతో ఆపరేట్ చేయాలని విమానయాన సంస్థలకు చెప్పాం
ప్ర. వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎంత మంది ప్రయాణికులు ఇక్కడికి వచ్చారు?
జ. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వందే భారత్ మిషన్‌లో ఐదు కేటగిరీల్లో విదేశాల్లో ఉన్న భారతీయులను రప్పిస్తున్నారు. ఇప్పటివరకు విశాఖ విమానాశ్రయానికి 41 సర్వీసులు వచ్చాయి. 5,500 మందికి పైగా భారతీయ ప్రయాణికులు విదేశాల నుంచి వచ్చారు. ఆయా యంత్రాంగాలు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆరోగ్య పరీక్షలు, పద్ధతులను పాటిస్తూ వారిని వారి స్వస్థలాలకు చేర్చాయి.
ప్ర. కార్గోకు సంబంధించి జరుగుతున్న రవాణా ఏ రకంగా ఉంది ? ఇక్కడ ఫార్మా సిటీ ఉంది. మందుల ఎగుమతులు ఎక్కడికి జరుగుతున్నాయి? లాక్ డౌన్లో కూడా పెద్ద ఎత్తున రవాణా జరిగింది కదా ?
జ. లాక్ డౌన్ ప్రక్రియలో దేశ, విదేశీ ప్రయాణీకుల విమానాలను నిలిపివేసినా కార్గో విమానాలు పై ఎటువంటి ఆంక్షలు లేవు. దేశీయ, అంతర్జాతీయ కార్గో పైనా ఎటువంటి నిషేధం విధించలేదు. ఫిబ్రవరి 24 వరకు విశాఖ విమానాశ్రయం నుంచి బెల్లీ కార్గో వెళ్ళేది. ఒకటిన్నర టన్ను సరకు మాత్రమే రవాణా చేయగలిగేవాళ్లం. ఫిబ్రవరి 25 నుంచి కార్గో ప్రత్యేక సర్వీసులు ప్రారంభమయ్యాయి. స్పైస్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఇక్కడ కార్గో ప్రారంభించారు. ష్రిమ్ప్, రొయ్యల సీడ్, రొయ్య పిల్లలు, ఫార్మా వంటి ఉత్పత్తులు నేరుగా దేశంలోని వివిధ ప్రదేశాలకు పంపేందుకు అవకాశం ఏర్పడింది. ఈ క్రమంలో అంతర్జాతీయ కార్గో కూడా దేశీయ కార్గో విమానాలతో అనుసంధానమైంది.
ప్ర. ఎంతవరకు కార్గో పెరిగింది.?
జ. ఫిబ్రవరి నుంచి గణాంకాలను పరిశీలిస్తే గత ఏడాది ఇదే సమయంలో పంపిన కార్గోకి దాదాపు రెట్టింపు కార్గో ఈ కాలంలో రవాణా చేశాం.
ప్ర. దీనివల్ల ఆదాయంలో వృద్ధి ఏ రకంగా ఉంది?
జ. రైతులకు రెవెన్యూ బాగా లభించింది. సూరత్ కేంద్రంలో రొయ్య సీడ్కి బాగా డిమాండ్ ఉంది. గతంలో బెల్లీ కార్గోలో రవాణా సమయం ఎక్కువగా ఉండడం వల్ల రైతులకు అంత ప్రయోజనకరంగా ఉండేది కాదు. ఇప్పుడు కార్గో విమానాల వల్ల నిర్ణీత ప్రదేశానికి నాలుగైదు గంటల్లో చేరుకోవడం ష్రిమ్ప్ రైతులకు ఎంతో ప్రయోజనంగా ఉంది. గతంలో సీడ్ చనిపోవడం వల్ల రైతులకు బాగా నష్టం వచ్చేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనివల్ల భవిష్యత్తులో కార్గో వల్ల ఎక్కువ ఆదాయం ఎయిర్ పోర్టు కూడా వచ్చే అవకాశం ఉంది.
ప్ర. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి మూడు నెలలు కార్గో రవాణా ఎలా ఉంది?
జ. ఏప్రిల్ మే జూన్ వరకు గత ఏడాదితో పోలిస్తే బెల్లీ కార్గో 24 గంటలకు పైగా పట్టేది. ఇప్పుడు 18 నుంచి 22 టన్నులు రవాణా చేసే కార్గో విమానాల వల్ల ఎక్కువ ప్రయోజనంగా ఉంది. మిగిలిన ప్రధాన సరకులు కూడా పంపుతున్నారు. కార్గో బిజినెస్ పొటెన్షియల్ బట్టి మరింత పెరుగుతుంది.
ప్ర. కోవిడ్ నిబంధనలు ఎలా అమలవుతున్నాయి?
జ. ప్రయాణికులు తిరిగే అన్ని ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తున్నాం. విశాఖలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రమాదం పొంచి ఉంది. అందర్నీ స్క్రీనింగ్ చేస్తున్నాం. పది పడకలతో సస్పెక్ట్ ఐసోలేషన్ వార్డు సిద్ధం చేశాం. లక్షణాలు ఉంటే వెంటనే స్వాబ్ టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే వారిని కోవిడ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మిగిలిన వారిని వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెబుతున్నాం.
ప్ర. రానున్న మూడు నెలల కాలం కీలకం కానుంది. ఈ కాలంలో ప్రయాణికుల రవాణా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?
జ. తప్పనిసరిగా ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. 5 విమానాలతో ప్రారంభమైన రాకపోకలు.. 10కి పెరిగాయి. ఇవి మరింత పెరుగుతాయి. నాన్ షెడ్యూల్ ఫ్లైట్లు కూడా ఆపరేట్ చేస్తున్నాం.
ఇదీ చదవండి: ఇకపై ‘తెలుగువెలుగు, బాలభారతం’ ఈ-పత్రికలు !