విద్య కేవలం ఉపాధి కోసం కాదనే విషయం అందరూ అర్థం చేసుకోవాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. ప్రజల జీవనశైలిలో నాణ్యత పెంచడానికే విద్య, సాంకేతికత, పరిశోధనలనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్ సదస్సులో ఆయన ప్రసంగించారు. విద్యార్థులు పుస్తకాలు మోయలేక వెన్ను సమస్యలు తెచ్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారని.. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
నైపుణ్యం కొరవడుతోంది...
ఏటా లక్షలాది మంది విద్యార్థులు కళాశాలల నుంచి బయటికొస్తున్నారని... కానీ వారిలో నైపుణ్యం మాత్రం ఉండటం లేదని వెంకయ్య నాయుడు తెలిపారు. గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లు పూర్తి చేసినవారికి తెలుగు, ఆంగ్లం రెండింటిలోనూ ప్రావీణ్యం ఉండటం లేదన్నారు. వారికి ఉద్యోగాలు పొందేలా, సొంత వ్యాపారం చేసుకునేలా శిక్షణ ఇవ్వాలంటే.. ఏదో ఒక భాషలో ప్రావీణ్యం సాధించాలని పేర్కొన్నారు. విద్యావ్యవస్థలో మాతృభాషకు పునాది పటిష్ఠంగా ఉండాలని అన్నారు. తెలుగు భాషలో విద్యను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
ఇదీ చదవండీ: "గిరిపుత్రికా కౌషల్ వికాస్"... మన్యంలో ఏం చేస్తుందంటే!?